మహారాష్ట్రలో హాట్ టాపిక్‌గా బాంద్రా ఘటన.. వాళ్లకు సీఎం చెప్పింది ఒక్కటే..

ABN , First Publish Date - 2020-04-15T02:26:27+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మే 3వరకూ పొడిగించిన ప్రకటన నేపథ్యంలో...

మహారాష్ట్రలో హాట్ టాపిక్‌గా బాంద్రా ఘటన.. వాళ్లకు సీఎం చెప్పింది ఒక్కటే..

రైళ్ల రాకపోకలు మొదలయ్యాయన్న పుకారే ఇందుకు కారణం: మహారాష్ట్ర సీఎం

ముంబై: దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను మే 3వరకూ పొడిగించిన ప్రకటన నేపథ్యంలో ముంబైలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 14తో లాక్‌డౌన్ ముగిసిందని భావించిన ముంబైలో చిక్కుకున్న 1500 మంది వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో బాంద్రా రైల్వే స్టేషన్‌కు తరలివెళ్లారు. తమకు వలస శిబిరాలు, ఆహారం అందించడం సమస్యకు పరిష్కారం కాదని.. తమను స్వస్థలాలకు పంపాలని డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్ ముందు బైఠాయించారు.


లాక్‌డౌన్ అమలును ఉల్లంఘించి తమను ఇబ్బంది పెట్టవద్దని.. తిరిగి వెళ్లిపోవాలని పోలీసులు చేసిన సూచనను కూడా వారు పట్టించుకోలేదు. దీంతో.. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనపై మహారాష్ట్రలో రాజకీయ విమర్శలు రేగాయి. అధికార శివసేన కేంద్రాన్ని తప్పుబడితే.. ప్రతిపక్ష స్థానంలో ఉన్న ఫడ్నవీస్ శివసేన ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. 


రాజకీయ దుమారం రేగిన నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. మీ ఇష్టం లేకుండా ఎవరూ మీరు ఇక్కడ ఉండాలని భావించడం లేదని, ఇది లాక్‌డౌనే తప్ప లాకప్ కాదని వలస కార్మికులను ఉద్దేశించి ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. ఇది మన దేశమని, మహారాష్ట్రలో మీరు పూర్తి సురక్షితంగా ఉంటారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వలస కార్మికులకు ఆయన సూచించారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేసే రోజున తాను మాత్రమే కాదని, కేంద్ర ప్రభుత్వం కూడా మీరు వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తోందని ఉద్ధవ్ తెలిపారు.


బాంద్రా ఘటనను రాజకీయం చేయొద్దని ఉద్ధవ్ కోరారు. నేటితో లాక్‌డౌన్‌ను ఎత్తేశారని, రైళ్ల రాకపోకలు మొదలయ్యాయన్న పుకారును నమ్మడం వల్లే వలస కార్మికులంతా రైల్వే స్టేషన్ బాట పట్టారని సీఎం చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికీ బాంద్రా రైల్వే స్టేషన్‌లో వందల మంది వలస కార్మికులు తమను స్వస్థలాలకు పంపాలని డిమాండ్ చేస్తూ బైఠాయించిన పరిస్థితి కనిపిస్తోంది.

Updated Date - 2020-04-15T02:26:27+05:30 IST