ప్రియాంకపై చేతులు వేస్తారా?: బీజేపీ నేత ఆగ్రహం
ABN , First Publish Date - 2020-10-05T00:44:14+05:30 IST
హత్రాస్ లో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి ప్రియాంకా గాంధీ, రాహూల్ గాంధీలతో కలిసి యూపీ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమ్రితా ధావన్ బయలుదేరారు
న్యూఢిల్లీ: హత్రాస్ బాధిత కుటుంబాన్ని కలుసుకోవడానికి బయల్దేరిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సహా ఇతర మహిళా నేతలపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై బీజేపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మహిళా నాయకుల బట్టలపై మగ పోలీసులు చేతులు వేస్తారా? ఎంత ధైర్యం మీకు?’’ అంటూ కోపడ్డారు. అంతే కాకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కూడా పరోక్షంగా నిప్పులు చెరిగారు. ‘‘భారత సంస్కృతిని యోగి గౌరవించినట్లియతే సదరు పోలీసులపై చర్యలు తీసుకోండి’’ అంటూ డిమాండ్ చేశారు.
‘‘మహిళా నాయకుల బట్టలపై చేతులు వేసేంతకు మగ పోలీసులు సాహసించారు. ఎంత ధైర్యం వారికి? మహిళలు మగవారిలా బయటికి రాలేకపోతున్నారు. వాళ్ల గౌరవం కూడా చూసుకుని రావాల్సి వస్తుంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. భారతీయ సంస్కృతిని విశ్వసించే ముఖ్యమంత్రే అయితే, అలా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోండి’’ అని మహారాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ చిత్ర కిషోర్ విఘ్ డిమాండ్ చేశారు.
హత్రాస్ లో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని కలవడానికి ప్రియాంకా గాంధీ, రాహూల్ గాంధీలతో కలిసి యూపీ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అమ్రితా ధావన్ బయలుదేరారు. ఆ సమయంలో వీరి పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో యూపీ పోలీసులు, కాంగ్రెస్ నేతలకు నడుమ తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అమ్రితా ధావన్ బట్టలు చిరిగిపోయాయి. దీనికి సంబంధించిన చిత్రాలను ఆమె తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు.