అమిత్‌ షా 24x7

ABN , First Publish Date - 2020-04-14T08:12:12+05:30 IST

కేంద్రం విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ మంగళవారంనాడు ముగుస్తోంది. ఈ సమయంలో అనేక మంత్రిత్వ శాఖల సిబ్బంది, అధికారులు విధులకు దూరంగా ఉండడమో లేక వర్క్‌ ఫ్రం హోం చేయడమో...

అమిత్‌ షా 24x7

  • లాక్‌డౌన్‌ టైంలో హోంశాఖ నిర్విరామ పని
  • అజయ్‌ భల్లా నేతృత్వంలో రోజంతా పర్యవేక్షణ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: కేంద్రం విధించిన 21 రోజుల లాక్‌డౌన్‌ మంగళవారంనాడు ముగుస్తోంది. ఈ సమయంలో అనేక మంత్రిత్వ శాఖల సిబ్బంది, అధికారులు విధులకు దూరంగా ఉండడమో లేక వర్క్‌ ఫ్రం హోం చేయడమో చేశారు. వారంతా సోమవారంనాడు గానీ విధులకు తిరిగి హాజరుకాలేదు. కానీ కేంద్ర హోంశాఖ మాత్రం నిర్విరామంగా పనిచేసింది. అమిత్‌ షా నేతృత్వంలో ఈ శాఖ మొత్తం లాక్‌డౌన్‌ సజావుగా సాగేట్లు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ క్రియాశీలకంగా వ్యవహరించింది. కేవలం శాంతి భద్రతలే కాదు, నిత్యావసరాలు, మందులు, అత్యవసర సామగ్రి ఎప్పటికప్పుడు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రాలకు తరలేట్లు చూసినది ఈ విభాగమే. ఈ శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా విపత్తు సహాయ చర్యల చట్టం అమలుపై ఏర్పాటైన జాతీయ కార్యవర్గ సంఘానికి ఛైర్మన్‌. ఈ కమిటీ నేతృత్వంలోనే లాక్‌డౌన్‌ చర్యలన్నీ అమలయ్యేది. ఆయన అసలు నార్త్‌ బ్లాక్‌ విడిచి బయటకే రాలేదు. మామూలు రోజుల్లో కంటే ఎక్కువ గంటలు ఆయన పనిచేసిన పరిస్థితిని అనేకమంది మీడియా సిబ్బంది చూశారు.


మార్చి 24, 25, 27, ఏప్రిల్‌ 2, 3, 10 తేదీల్లో వెలువరించిన ఆరు కీలక ఉత్తర్వులు, అడ్వయిజరీలు అజయ్‌ భల్లా సంతకంతో వచ్చినవే. ఆయనకు సహాయంగా ఆరుగురు అదనపు కార్యదర్శులు, 14 మంది సంయుక్త కార్యదర్శులు కూడా ప్రతీరోజూ ఆఫీసుకు వచ్చి రాత్రి పొద్దుపోయే వరకూ ఉండేవారు. ఒక్కొక్కరూ ఒక్కో అంశం చొప్పున పని విభజించుకుని అమలు చేసేవారు. అమిత్‌ షా తో పాటు ఆయన సహాయ మంత్రులైన జి కిషన్‌రెడ్డి, నిత్యానంద్‌ రాయ్‌ కూడా నిరంతరం ఆఫీసులకొచ్చి మొత్తం వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆంతరంగిక భద్రతా శాఖ సంయుక్త కార్యదర్శి పున్యా సలీలా శ్రీవాస్తవ కూడా ఈ టీమ్‌ అందరితో అవిశ్రాంతంగా పనిచేశారు. ముఖ్యంగా వలస కూలీల వెతలు సంక్షోభ స్థాయికి చేరినపుడు అమిత్‌ షా, శ్రీవాస్తవ సంయుక్తంగా రంగంలోకి దిగి వారు స్వస్థలాలకు వెళ్లగలిగేలా రాష్ట్రాలకు సూచనలు ఇచ్చారు. ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌తో పాటు ప్రతీరోజూ మీడియా సమావేశానికి పున్యా సలీలాయే హాజరయ్యారు. ఆమె ఇచ్చిన ఇన్‌పుట్సే కొవిడ్‌పై కేంద్రం తీసుకుంటున్న చర్యలను  వెల్లడించేవి. ఆరోగ్య శాఖ కూడా నిరంతరం పనిచేసినా అది కేవలం కొవిడ్‌ కేసులపై దృష్టి పెట్టి అడ్వయిజరీల వరకే పరిమితమైంది. ఓ రకంగా వైరస్‌ నోడల్‌ కేంద్రంగా హోంశాఖే వ్యవహరించింది. ప్రధానికి అప్‌డేట్‌ చేయడం కూడా అజయ్‌ భల్లా, కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా చేశారు. 


Updated Date - 2020-04-14T08:12:12+05:30 IST