ఎన్‌కౌంటర్ సమయంలో హిజ్బుల్ ఉగ్రవాది లొంగుబాటు

ABN , First Publish Date - 2020-10-27T12:32:23+05:30 IST

జమ్మూకశ్మీరులోని అవంతిపొరాలోని నూర్ పొరా ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటరులో హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఓ ఉగ్రవాది...

ఎన్‌కౌంటర్ సమయంలో హిజ్బుల్ ఉగ్రవాది లొంగుబాటు

అవంతిపొరా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని అవంతిపొరాలోని నూర్ పొరా ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్ కౌంటరులో హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు  చెందిన ఓ ఉగ్రవాది మరణించగా,మరో ఉగ్రవాది లొంగిపోయాడు.నూర్ పొరా ప్రాంతంలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీరు పోలీసులు కేంద్ర భద్రతా బలగాలతో కలిసి గాలింపు చేపట్టారు. గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. ఎదురుకాల్పులు సాగుతుండగానే హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాది సాఖిబ్ అక్బర్ వజా పోలీసుల ముందు లొంగిపోయాడు. 


పుల్వామా జిల్లా గుల్షన్ పురాకు చెందిన సాఖిబ్ అక్బర్ వజా పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో బీటెక్ చదువుతున్నాడని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. సాఖిబ్ హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలో ఇటీవల చేరాడని, ఎదురుకాల్పులు సాగుతుండగా అతను లొంగిపోయాడని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.ఉగ్రవాదుల నుంచి పోలీసులు ఒక ఏకే 47 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.లొంగిపోయిన ఉగ్రవాది మాట్లాడిన వీడియోను అతని కుటుంబసభ్యులకు పోలీసులు పంపించారు.తాను కొత్త జీవితం ప్రారంభించేందుకు భద్రతా బలగాలు అవకాశమిచ్చాయని జవాన్లను మెచ్చుకుంటూ వజా వీడియోలో మాట్లాడారు.తాను సెప్టెంబరు 25వతేదీన హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలో చేరానని, కాని మంచివారెవరూ ఉగ్రవాద సంస్థల్లో చేరరాదని వజా సూచించారు. 

Updated Date - 2020-10-27T12:32:23+05:30 IST