పాకిస్థాన్ ఐఎస్ఐలో ‘బోనఫైడ్’ అధికారిగా ఉగ్రవాద సంస్థ చీప్ సలాహుద్దీన్

ABN , First Publish Date - 2020-09-06T21:37:37+05:30 IST

పాకిస్థాన్ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. ప్రపంచం తన గురించి ఏం అనుకున్నా పట్టించుకోకుండా బరితెగించింది.

పాకిస్థాన్ ఐఎస్ఐలో ‘బోనఫైడ్’ అధికారిగా ఉగ్రవాద సంస్థ చీప్ సలాహుద్దీన్

న్యూఢిల్లీ : పాకిస్థాన్ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. ప్రపంచం తన గురించి ఏం అనుకున్నా పట్టించుకోకుండా బరితెగించింది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌ను పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)లో ‘బోనఫైడ్’ అధికారిగా పేర్కొంది. భద్రతా సంస్థలు ఇటీవల సంపాదించిన ఓ పత్రం ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో పాకిస్థాన్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థల మధ్య సాన్నిహిత్యం మరోసారి బయటపడింది. 


జమ్మూ-కశ్మీరులో భారత దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించేందుకు పాకిస్థాన్ సైన్యం యూనిఫైడ్ కమాండ్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఉగ్రవాద సంస్థ పేరు యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ (యూజేసీ). దీనికి సలాహుద్దీన్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో సలాహుద్దీన్‌కు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇస్తున్నట్లు తెలియజేసే పత్రాన్ని భద్రతా సంస్థలు సంపాదించాయి. సలాహుద్దీన్‌ను భద్రతా చెక్ పాయింట్ల వద్ద ఆపడానికి వీల్లేదని ఈ పత్రం చెప్తోంది. ఈ పత్రం 2020 డిసెంబరు 31 వరకు చెల్లుబాటవుతుందని తెలుస్తోంది. 


దీనినిబట్టి ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలకు పాకిస్థాన్ మద్దతు ఉన్నట్లు స్పష్టమవుతోంది. 


ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్ చేయడం, మనీలాండరింగ్ వంటివాటిని నిరోధించేందుకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) అంతర్జాతీయ స్థాయిలో కృషి చేస్తుంది. ఎఫ్ఏటీఎఫ్  యాక్షన్ ప్లాన్‌ను పాకిస్థాన్ అమలు చేస్తున్న తీరుపై అక్టోబరులో సమీక్ష జరుగుతుంది. ఈ సంస్థ ఆమోదిస్తేనే పాకిస్థాన్‌కు ఇతర దేశాల నుంచి ఉగ్రవాదంపై పోరాటం కోసం గ్రాంట్లు, సహాయం మంజూరవుతుంది. 


సలాహుద్దీన్ భారత దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ప్రధాన సూత్రధారి. జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రిస్తున్నాడు. జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ నిధులు ఇస్తున్నట్లు అనేకసార్లు చెప్పాడు. కశ్మీరు సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని అడ్డుకుంటామని ప్రతినబూనాడు. 


భారత దేశ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. సలాహుద్దీన్‌ను స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్టుగా అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ప్రకటించింది.


Updated Date - 2020-09-06T21:37:37+05:30 IST