రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేయండి.. కేంద్రానికి శివసేన డిమాండ్

ABN , First Publish Date - 2020-04-28T22:50:52+05:30 IST

కరోనాను నియంత్రించేందుకు ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలను సరిగా లేవని శివసేన విమర్శించింది. లాక్‌డౌన్ విధించడంతో...

రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేయండి.. కేంద్రానికి శివసేన డిమాండ్

ముంబై: కరోనాను నియంత్రించేందుకు ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలను సరిగా లేవని శివసేన విమర్శించింది. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో రాష్ట్రాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని, వెంటనే దేశ జీడీపీలో 10శాతం వాటాను రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. దీని ద్వారా ఆయా రాష్ట్రాలు కరోనా ఎదుర్కొనేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి శరద్ పవార్ రాసిన లేఖను సొంత పత్రిక సామ్నాలో ప్రచురించింది. ‘కేంద్ర ప్రభుత్వానికి ఒక్క మహారాష్ట్ర నుంచే రూ.2.25 లక్షల కోట్లు పన్నుల రూపంలో వసూలవుతోంది. దేశ ఆదాయంలో తమ రాష్ట్రం వాటా చాలా ఎక్కువ. అలాంటి రాష్ట్రం ప్రస్తుతం రూ.1.40 లక్షల కోట్ల లోటుబడ్జెట్‌లోకి కూరుకుపోయింది. దీనికి తోడు ప్రజలకు సరిపడా వైద్య, ఆరోగ్య సదుపాయాలు అందించేందుకు, విద్యా సౌకర్యాలను కల్పించేందుకు మరిన్ని నిధులు అవసరముంది. కానీ వాటిని ప్రస్తుతం రాష్ట్రం సమకూర్చుకునే పరిస్థితుల్లో లేదు. మహారాష్ట్ర పరిస్థితే ఇలా ఉంటే బీహార్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, అస్సాం వంటి రాష్ట్రాల పరిస్థితి ఇంకెంత దారుణంగా తయారవుతుందో ఆలోచించండి’ అంటూ శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా రాష్ట్రాలకు సాయం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు రావాలని శివసేన డిమాండ్ చేసింది.

Updated Date - 2020-04-28T22:50:52+05:30 IST