హత్రాస్ ఘటనలో నిందితులకే మద్దతు!.. తీవ్ర విమర్శలు

ABN , First Publish Date - 2020-10-04T00:34:28+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో పరిస్థితి క్రితం రోజుతో పోలిస్తే కాస్త చల్లబడింది. అయితే, ఇంకా సాధారణ పరిస్థితులు మాత్రం నెలకొనలేదు. వాస్తవానికి...

హత్రాస్ ఘటనలో నిందితులకే మద్దతు!.. తీవ్ర విమర్శలు

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో పరిస్థితి క్రితం రోజుతో పోలిస్తే కాస్త చల్లబడింది. అయితే, ఇంకా సాధారణ పరిస్థితులు మాత్రం నెలకొనలేదు. వాస్తవానికి శనివారం ఉదయం శుక్రవారం కన్నా ఎక్కువ బలగాలను మోహరించారు. హైవేపై టోల్‌గేట్‌ను పోలీసులే దిగ్బంధించారు. కాంగ్రెస్‌పార్టీ ముఖ్యనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తాము ఖచ్చితంగా హత్రాస్‌కు వెళ్లి తీరతామని మరోసారి కరాఖండిగా ప్రకటించడంతో ఏం జరుగుతుందో ఉన్న ఉత్కంఠ వెంటాడింది. 


గురువారం హత్రాస్‌ బయలుదేరిన రాహుల్‌, ప్రియాంక గాంధీలను యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవే పైనే అడ్డుకున్న పోలీసులు వాళ్లను అరెస్ట్‌ చేశారు. సిట్‌ విచారణ, 144 సెక్షన్‌ కారణంగా హత్రాస్‌లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించే పరిస్థితి లేదని పోలీసులు స్పష్టం చేశారు. వాహనాలను అడ్డుకున్నారు. దీంతో నడుచుకుంటూ అయినా హత్రాస్‌ వెళ్లితీరతామని కాలిబాటన వెళ్తున్న వాళ్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, శనివారం మరోసారి రాహుల్‌ గాంధీ హత్రాస్‌ వెళ్తున్నట్లు ప్రకటించారు. అటు.. పోలీసులు ఢిల్లీనుంచి మొదలుకొని హత్రాస్‌దాకా భారీగా మోహరించారు. దీంతో, ఏం జరుగుతుందో అని అందరూ అటువైపే దృష్టి సారించారు. 



ముందుగా చెప్పినట్లుగానే రాహుల్‌గాంధీ, తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో హత్రాస్‌కు బయలుదేరారు. వాళ్లతో కలిసి పలువురు ఎంపీలు కూడా హత్రాస్‌ బయలుదేరారు. ఇక కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో వాళ్ల వాహన శ్రేణిని అనుసరించారు. కాంగ్రెస్‌పార్టీ భారీ జెండాలను వాహనాలకు, బైక్‌లకు బిగించి రాహుల్‌గాంధీ వెంట వెళ్లారు. చివరికి హత్రాస్‌ వెళ్లేందుకు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే.. వీళ్లిద్దరితో కలిసి మరో ముగ్గురికి మాత్రమే హత్రాస్‌ దాకా వెళ్లేందుకు పోలీస్‌ అధికారులు అంగీకరించారు. దీంతో.. ఉద్రిక్తత కాస్త తగ్గుముఖం పట్టింది. 


ఐదుగురికి మాత్రమే హత్రాస్‌ వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో.. ప్రియాంక గాంధీ స్వయంగా వాహనం నడుపుతుండగా.. రాహుల్‌ పక్కన కూర్చున్నారు. తొలుత మొత్తం 40 మంది ఎంపీలతో రాహుల్‌ - ప్రియాంక హత్రాస్‌ బయలుదేరారు. అయితే, నోయిడా టోల్‌ప్లాజా దగ్గర పోలీస్‌ బలగాలు దిగ్బంధనం చేశాయి. అందరినీ పోలీసులు అడ్డుకున్నారు. అక్కడినుంచి ముందుకు వెళ్లేందుకు మొత్తం ఐదుగురికి మాత్రమే అనుమతి ఇచ్చారు.


పోలీసుల దిగ్బంధంలో ఉన్న హత్రాస్‌లోకి శనివారం మీడియాను కూడా అనుమతించారు. మీడియాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినట్టు సదర్‌ ఎస్‌డీఎం ప్రేమ్‌ ప్రకాష్‌ మీనా తెలిపారు. హత్రాస్‌లో సిట్ విచారణ జరుగుతోందని, విచారణలో ఎలాంటి అవరోధాలు కలగకుండా ఉండేందుకే ఎవర్నీ హత్రాస్‌లోకి రానివ్వలేదని, ఆయన చెప్పారు. శనివారంతో ఆంక్షలు తొలగిపోయాయని, ఇప్పుడు ఎవరైనా గ్రామంలోకి వెళ్లి, ఎవర్నైనా ఇంటర్వ్యూ చేసుకోవచ్చని అన్నారు. దీంతో మీడియా ప్రతినిధులు బాధిత కుటుంబాన్ని కలుసుకుని వివరాలు సేకరించారు. 


మరోవైపు.. మూడు రోజులుగా తాము ఇంటికే పరిమితమయ్యామని... అధికారులు ప్రశ్నలపై ప్రశ్నలు వేశారని బాధితురాలి కుటుంబసభ్యులు మీడియాకు వివరించారు. కొంతమంది ప్రలోభాలకు కూడా గురిచేశారని చెప్పారు. కేసులో సాక్ష్యాలు మాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోనుంచి బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉందని, తమకు న్యాయం కావాలని వేడుకున్నారు. 



తమకు సీబీఐ విచారణ అవసరం లేదని బాధతురాలి తల్లి చెప్పారు. తన కుమార్తె భౌతిక కాయం కావాలంటూ విలపించారు. తామెప్పుడూ మాట మార్చలేదన్నారు. తమకు నార్కో టెస్టులు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. అసలు ఈ టెస్టులంటే ఏంటో కూడా తమకు తెలియదన్నారు. మరోవైపు.. బాధితురాలి కుటుంబ సభ్యులను పోలీసు అధికారులు పరామర్శించారు. వారి అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సిట్‌ విచారణకు వారు ఒప్పుకున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే నార్కో టెస్టులు నిలిపివేయాలంటూ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.


ఇలాంటి దుర్ఘటనలపై సామాజిక వేత్త తృప్తి దేశాయ్‌ మండిపడ్డారు. బాధితులకు ఆత్మహత్యలే శరణ్యమా అని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం విఫలమయ్యిందని, మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు. 'బేటీ పఢావ్, బేటీ బచావ్' అనే పథకాన్ని 'బేటీ బచావ్.. బేటీ పఢావ్.. బేటాకో భీ సంఝావ్" అని మార్చాలని సూచించారు. అయితే ఈ ఘటనను కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు.. దేశ రాజకీయాల గురించి తెలిసినవారికి కాంగ్రెస్‌ ఎత్తుగడలు తెలుసని వ్యాఖ్యానించారు.



ఇంత వివాదం జరుగుతున్నా హత్రాస్ ఘటనలో నిందితులకే ఉన్నత వర్గాలు మద్దతు ప్రకటించడం దుమారం రేపుతోంది. బాధితురాలి ఇల్లు ఉన్న బూల్ గడీ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని భగ్న గ్రామంలో పెద్దలు పంచాయతీ నిర్వహించారు. హాథ్రస్ ఘటనలో అరెస్టు అయిన నిందితులకే న్యాయం చేయాలని సావర్న్ సమాజ్‌కు చెందిన పెద్దలు డిమాండ్‌ చేశారు. అంతేకాదు ధర్నా కూడా చేశారు. హాథ్రస్‌ కేసులో నిందితులు అమాయకులని, వారిపై నిందలు వేస్తున్నారని పంచాయతీ పెద్దలు చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


- సప్తగిరి గోపగోని, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-10-04T00:34:28+05:30 IST