రైతులకు మద్దతుగా ఎల్డీబీకి ఎమ్మెల్యే రాజీనామా
ABN , First Publish Date - 2020-12-01T20:09:57+05:30 IST
గతేడాది హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నిల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగ్వాన్.. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం బీజేపీ-జేజేపీ కూటమికి మద్దతు తెలిపారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనకు మద్దతుగా హర్యానా లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ బోర్డ్ చైర్మన్ పదవికి చెందిన ఎమ్మెల్యే సోంబిర్ సంగ్వాన్ సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు అందించారు. గతేడాది హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నిల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సంగ్వాన్.. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం బీజేపీ-జేజేపీ కూటమికి మద్దతు తెలిపారు.
‘‘రైతులకు మద్దతుగా నేను ప్రస్తుతం ఉన్న పదవికి రాజీనామా చేస్తున్నాను. దేశంలో రైతులందరితో పాటు నా నియోజకవర్గమైన దాద్రి నియోజకవర్గ రైతులు కూడా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో రైతులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అంతే కాకుండా ఇది నా బాధ్యత కూడా. నా మనస్సాక్షిని నేను ప్రశ్నించుకున్నాను. రైతులకు మద్దతు తెలపడమే సరైందని అనిపించింది. అందుకే వారికి మద్దతు ఇస్తున్నాను’’ అని సీఎంకు రాసిన లేఖలో సాంగ్వాన్ రాసుకొచ్చారు.