బేర సారాలతో బీజేపీకి సంబంధం లేదు : హనుమాన్ బేనీవాలా

ABN , First Publish Date - 2020-07-19T19:28:26+05:30 IST

ఎలాంటి బేర సారాల్లోనూ బీజేపీ పాల్గొనలేదని బీజేపీ మిత్రపక్షమైన లోక్ తాంత్రిక్ అధ్యక్షుడు హనుమాన్

బేర సారాలతో బీజేపీకి సంబంధం లేదు : హనుమాన్ బేనీవాలా

జైపూర్ : ఎలాంటి బేర సారాల్లోనూ బీజేపీ పాల్గొనలేదని బీజేపీ మిత్రపక్షమైన లోక్ తాంత్రిక్ అధ్యక్షుడు హనుమాన్ బేనీవాలా స్పష్టం చేశారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అనే వ్యవస్థను సీఎం గెహ్లోత్ దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. సీఎం గెహ్లోత్ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని, ఓ భార్య ఆమె భర్తతో కూడా ఫోన్లో మాట్లాడడానికి జంకుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తొందర్లోనే కూలిపోతుందని, సర్కార్ పై ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేదన్నారు.


తమను బందీలుగా ఉంచారని ప్రకటించిన బీటీపీ ఎమ్మెల్యేలే ఈ రోజు గెహ్లోత్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారని, కానీ... బల పరీక్ష సమయంలో వారు గెహ్లోత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని హనుమాన్ బాంబు పేల్చారు.


కేబినెట్ బెర్త్ ఇస్తామన్న దానితో సీఎం ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారని, ఇప్పటి వరకూ గెహ్లోత్ కేబినెట్‌ను ఎందుకు విస్తరించలేదో చెప్పాలని సవాల్ విసిరారు. మాజీ సీఎం వసుంధరా రాజే గెహ్లోత్ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఇప్పటికి 3,000 సార్లు ప్రకటించానని, ఇప్పటికీ అదే మాట మీద నిలబడుతున్నానని హనుమాన్ బేనీవాలా స్పష్టం చేశారు. 

Updated Date - 2020-07-19T19:28:26+05:30 IST