హెచ్‌-1బీ వీసాలపై కత్తి!

ABN , First Publish Date - 2020-05-10T07:38:04+05:30 IST

కరోనా వైరస్‌ దెబ్బతో అమెరికా అతలాకుతలం అవుతోంది. ఆర్థిక కార్యకలాపా లు ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో అనేక మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోండంతో...

హెచ్‌-1బీ వీసాలపై కత్తి!

  • తాత్కాలికంగా నిషేధించే యోచనలో అమెరికా
  • విద్యార్థి వీసాలకూ పొంచి ఉన్న ముప్పు 
  • అగ్రరాజ్యంలో నిరుద్యోగ విజృంభణే కారణం

వాషింగ్టన్‌, మే 9: కరోనా వైరస్‌ దెబ్బతో అమెరికా అతలాకుతలం అవుతోంది. ఆర్థిక కార్యకలాపా లు ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో అనేక మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోండంతో కొన్ని పని ఆధారిత వీసాల జారీని తాత్కాలికంగా నిషేధించాలని ట్రంప్‌ ప్రభుత్వం యోచిస్తోంది. వీటిలో హెచ్‌-1బీ, స్టూడెంట్‌ వీసాలు కూడా ఉన్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పేర్కొంది. హెచ్‌-1బీ వీసాల ద్వారా అమెరికా కంపెనీలు విదేశీ సాంకేతిక నిపుణులను నియమించుకుంటున్నాయి. భారత్‌, చైనా తదితర దేశాల నిపుణులు ఈ వీసాల ద్వారానే అమెరికాలో ఐటీ ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఒకవేళ హెచ్‌-1బీ వీసాలను తాత్కాలికంగా నిషేధిస్తే భారతీయుల అమెరికా ఆశలు గల్లంతుకానున్నాయి. హెచ్‌-1బీ వీసాలపై 5 లక్షల మంది వలస కార్మికులు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే కరోనాతో యూఎ్‌సలో పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయి నిరుద్యోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పని ఆధారిత వీసాలను తాత్కాలికంగా నిషేధించాలని అమెరికా అధ్యక్షుడి వద్దనున్న ఇమ్మిగ్రెంట్‌ సలహాదారులు ప్రణాళికలు రచిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ఈ నెలలోనే వెలువడవచ్చని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.


ముఖ్యంగా ఈ ఆదేశం హెచ్‌-1బీ, హెచ్‌-2బీ (సీజనల్‌ వ లస కార్మికులు), విద్యార్థి వీసాలు, వీటితోపాటు వర్క్‌ ఆథరైజేషన్‌ ఉండే వీసాలపై దృష్టిసారించనున్నట్టు తెలిపింది. కరోనాతో గత 2 నెలల్లో అగ్రరాజ్యంలో 3.3 కోట్లకు పైగా అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. కరోనా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. అమెరికా ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేసుకోవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అమెరికా 15 నుంచి 20 శాతం వరకు ప్రతికూల వృద్ధి రేటును సాధించవచ్చని వైట్‌ హౌస్‌ అధికారులు చెబుతున్నారు. ఇక నిరుద్యోగం ఆందోళనకర స్థాయిలో ఉంది. ఏప్రిల్‌ నెలకు సంబంధించిన నిరుద్యోగం 14.7 శాతానికి ఎగబాకింది. ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా సరిహద్దులను మూసివేసింది. దీని వల్ల వలసలకు అడ్డుకట్టపడుతుందని భావిస్తున్నారు.


Updated Date - 2020-05-10T07:38:04+05:30 IST