విమాన టికెట్‌ కొనలేక..!

ABN , First Publish Date - 2020-05-10T08:08:55+05:30 IST

రెండు నెలలుగా వేతనాలు రాక.. విమాన టికెట్లు కొనుక్కోవడానికి డబ్బుల్లేక గల్ఫ్‌ దేశాల్లోని తెలుగు ప్రవాసులు ఇబ్బందులు పడుతున్నారు. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా కువైత్‌ నుంచి హైదరాబాద్‌ రావాల్సిన...

విమాన టికెట్‌ కొనలేక..!

  • సొంత గడ్డకు వచ్చేందుకు డబ్బుల్లేక..
  • గల్ఫ్‌ దేశాల్లో తెలుగు ప్రవాసుల ఇక్కట్లు!
  • పేర్లు నమోదు చేసుకున్నా రాలేని పరిస్థితి
  • క్వారంటైన్‌ ఖర్చులు భరించలేక వెనుకంజ

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

రెండు నెలలుగా వేతనాలు రాక.. విమాన టికెట్లు కొనుక్కోవడానికి డబ్బుల్లేక గల్ఫ్‌ దేశాల్లోని తెలుగు ప్రవాసులు ఇబ్బందులు పడుతున్నారు. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా కువైత్‌ నుంచి హైదరాబాద్‌ రావాల్సిన విమానం.. తీవ్ర గందరగోళం మధ్య ఆలస్యంగా బయలుదేరింది. వాస్తవానికి శుక్రవారమే ఈ విమానం బయలుదేరాల్సి ఉన్నా ఆమ్నెస్టీ విమానాల వివాదంతో కువైత్‌ ప్రభుత్వం అడ్డుకుంది. దీనికితోడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో క్వారంటైన్‌ ఖర్చులను భరించే స్థోమత లేక చాలా మంది వెనుకంజ వేశారు. హైదరాబాద్‌ వెళ్లాల్సిన ప్రయాణికులను వెతికి మరీ పట్టుకున్న అధికారులు.. శనివారం సాయంత్రం వరకూ టికెట్లు విక్రయించి విమాన సీట్లన్నీ భర్తీ చేశారు. పూర్తి దిగ్బంధంలో ఉన్న ప్రాంతాల నుంచి కూడా భారతీయ ఎంబసీ ప్రత్యేక బస్సుల్లో ప్రవాసులను విమానాశ్రయానికి తరలించింది. విమాన టికెట్లతో పాటు హైదరాబాద్‌లో దిగిన తర్వాత క్వారంటైన్‌ ఖర్చు చెల్లించడానికి సిద్ధంగా ఉన్న వారు మాత్రమే బయలుదేరారు.


త్రీ స్టార్‌ హోటల్‌ క్వారంటైన్‌కు రూ.30 వేలు, టు స్టార్‌ హోటల్‌ క్వారంటైన్‌కు రూ.15 వేలు, సాధారణ క్వారంటైన్‌కు రూ.5వేలు చొప్పున ప్రయాణికుల నుంచి వసూలు చేశారు. దీంతో పేర్లు నమోదు చేసుకున్న వారు సైతం టికెట్లు కొనుగోలుకు ముందుకు రాలేదు. హైదరాబాద్‌ చేరుకున్న తర్వాత 14 రోజుల క్వారంటైన్‌ కాలాన్ని ఏ రాష్ట్రంలో గడపాలో స్పష్టంగా తెలియకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ వాసుల్లో సందిగ్ధం నెలకొంది. కువైత్‌ నుంచి హైదరాబాద్‌కు సాధారణంగా వన్‌ వే టికెట్‌ ధర 60-70 దినార్లు కాగా, ఇప్పుడు 90 దినార్లకు విక్రయించారు. అది కూడా కార్డులు అంగీకరించకుండా, కేవలం నగదును తీసుకుని టికెట్లు విక్రయించడంతో చాలా మంది కొనుగోలు చేయలేకపోయారు. కాగా, విమానంలో సైతం ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా ఒక్కో వరుసలో ముగ్గుర్ని చొప్పున కూర్చోబెట్టడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తి కావడంతో రెండు నెలలుగా స్వదేశానికి తిరిగి వెళ్లడానికి తాను నిరీక్షిస్తున్నానని, వారం రోజుల అయోమయం తర్వాత ఇప్పుడు బయలుదేరుతున్నాని చమురు రంగంలో క్వాలిటీ కంట్రోల్‌ ఇంజనీర్‌గా పని చేసే కరీంనగర్‌ జిల్లా వాసి రాచకొండ నరేందర్‌ పేర్కొన్నారు. విమాన టికెట్‌తోపాటు క్వారంటైన్‌ ఖర్చు చెల్లించడానికి సిద్ధపడడంతో తాను స్వదేశానికి తిరిగి రాగలుగుతున్నానని చెప్పారు. జీవితంలో మరో సారి తాను గల్ఫ్‌కు రానని హైదరాబాద్‌కు చెందిన జర్మన్‌ భాష అధ్యాపకురాలు కొత్తకాపు హరిప్రియ పేర్కొన్నారు. అనేక మంది తెలుగు ప్రవాసులు టికెట్లు కొనలేక ఇబ్బంది పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీలో క్వారంటైన్‌ ఖర్చుల  సమాచారం తెలియకపోవడంతో చాలా మంది వెళ్లలేకపోతున్నారని కువైత్‌లో ప్రవాసాంధ్ర ప్రముఖుడు కోడూరి వెంకట్‌ చెప్పారు.

Updated Date - 2020-05-10T08:08:55+05:30 IST