కోర్టులో ధూమపానం చేసిన న్యాయవాదికి రూ.10వేల జరిమానా
ABN , First Publish Date - 2020-10-07T15:48:50+05:30 IST
కోర్టు వర్చువల్ హియరింగ్ సమయంలో ధూమపానం చేసిన న్యాయవాది గుజరాత్ హైకోర్టుకు క్షమాపణలు చెప్పి రూ.10వేల జరిమానా చెల్లించిన ఘటన అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది....

కోర్టు వర్చువల్ హియరింగ్ సమయంలో...
అహ్మదాబాద్ (గుజరాత్): కోర్టు వర్చువల్ హియరింగ్ సమయంలో ధూమపానం చేసిన న్యాయవాది గుజరాత్ హైకోర్టుకు క్షమాపణలు చెప్పి రూ.10వేల జరిమానా చెల్లించిన ఘటన అహ్మదాబాద్‌లో వెలుగుచూసింది. కరోనా వైరస్ కారణంగా హైకోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేసులను విచారిస్తోంది. సెప్టెంబరు 24వతేదీన హైకోర్టు వర్చువల్ హియరింగ్ సమయంలో న్యాయవాది జేవీ అజ్మెరా కారులో కూర్చొని ధూమపానం చేస్తున్నారని జస్టిస్ ఎ.ఎస్. సుపెహియా గమనించారు. న్యాయవాది జేవీ అజ్మెరా బాధ్యతారహిత ప్రవర్తనపై కోర్టు విచారించి అతనికి జరిమానా విధించింది.
న్యాయవాది అజ్మెరా ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన కోర్టు వారంలోనే పదివేల రూపాయలను జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. కోర్టు విచారణ సమయంలో న్యాయవాది కారులో ధూమపానం చేయడం ఖండించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.న్యాయవాది అజ్మెరా క్షమాపణను అంగీకరించి కోర్టు రికార్డు చేసిందని, ప్రవర్తనా నియమావళిని పాటించాలని అజ్మెరాకు కోర్టు సూచించింది.