ఐదుగురు ఎమ్మెల్యేలపై గుజరాత్ కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2020-03-16T23:02:39+05:30 IST

ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ఐదుగురు గుజరాత్ కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ సోమవారంనాడు సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి..

ఐదుగురు ఎమ్మెల్యేలపై గుజరాత్ కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు

అహ్మదాబాద్: ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ఐదుగురు గుజరాత్ కాంగ్రెస్ నేతలపై ఆ పార్టీ సోమవారంనాడు సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి వారిని సస్పెండ్ చేసింది. త్వరలో రాష్ట్రం నుంచి రాజ్యసభ ద్వైవాక్షిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.


ఎమ్మెల్యేలు సోమభాయ్ పటేల్, జేకే కాకడీయ, ప్రద్యుమ్న్‌సిన్హ్ జడేజా, ప్రవీణ్ మరు, మంగళ్ గవట్‌లు పార్టీ పట్ల అవిధేయత చూపిన కారణంగా వారిని సస్పెండ్ చేసినట్టు కాంగ్రెస్ గుజరాత్ విభాగం చీఫ్ అమిత్ చావ్డా ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ గుర్తుపై వీరంతా ఎన్నికల్లో గెలిచి రాజ్యసభ ఎన్నికలకు ముందు వీరు పార్టీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చావ్డా పేర్కొన్నారు.


గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 180 మంది సభ్యులకు గాను, బీజేపీకి 103 మంది సభ్యులు, కాంగ్రెస్‌కు ఐదుగురు సభ్యుల రాజానామా అనంతరం 68 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే  41 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ జైపూర్‌కు తరలించింది. మరో 25 మంది ఎమ్మెల్యేలను సోమవారం సాయంత్రం విమానంలో ఢిల్లీకి తరలిస్తోంది. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీజేపీ ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈనెల 26న ఎన్నికలు జరుగనున్నాయి.

Updated Date - 2020-03-16T23:02:39+05:30 IST