ఆ రుణం ప్రైవేట్‌కే!

ABN , First Publish Date - 2020-05-18T09:06:25+05:30 IST

ఎన్‌టీపీసీతోపాటు ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థల బకాయిలు చెల్లించడానికే ‘ఆత్మనిర్భర్‌’ కింద డిస్కమ్‌లకు రుణం దక్కనుంది. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి...

ఆ రుణం ప్రైవేట్‌కే!

  • జెన్‌కోలకిచ్చేందుకు కాదు
  • పీఎ్‌ఫసీ, ఆర్‌ఈసీ రుణంలో మెలిక
  • తెలంగాణకు రూ.7,298 కోట్లకే చాన్స్‌

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ఎన్‌టీపీసీతోపాటు ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థల బకాయిలు చెల్లించడానికే ‘ఆత్మనిర్భర్‌’ కింద డిస్కమ్‌లకు రుణం దక్కనుంది. కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి వీలుగా రూ.20 లక్షల కోట్లతో కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో వివిధ డిస్కమ్‌లు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు బకాయి పడిన రూ.90,000 కోట్లకు రుణాలను కేంద్రం ఆఫర్‌ చేసింది. ఇక రూ.90 కోట్ల ఆఫర్‌లో చాలా మెలికలు ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ సంస్థలు డిస్కమ్‌లకు ఎంత విద్యుత్‌ బిల్లులు బకాయి ఉన్నాయో అంత డిస్కమ్‌లు రుణం తీసుకునే వెసులుబాటుఉంది. దీనికి ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వాల్సిందే. ఇచ్చే రుణాన్నంతా ప్రైవేట్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల ఖాతాల్లోనే జమచేయనున్నారు. జెన్‌కోకు చిల్లిగవ్వ రాదు. సింగరేణికీ అనుమానమే. ప్రస్తుతం ఎల్‌సీ నిబంధన కింద సింగరేణికి ముందస్తు చెల్లింపుల్లేవు.  తెలంగాణలో వివిధ ప్రభుత్వ శాఖలు డిస్కమ్‌లకు రూ.7,298 కోట్ల కరెంట్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆరేళ్లలో బకాయిలు రెండింతలు పెరిగాయి. వాస్తవానికి తెలంగాణ డిస్కమ్‌లు రూ.13 వేల కోట్ల కరెంట్‌ కొనుగోళ్లకు చెల్లింపులు చేయాల్సి ఉంది. రుణం తీసుకుంటే ఎన్‌టీపీసీ, ఛత్తీ్‌సగఢ్‌తో పాటు వివిధ ప్రైవేట్‌ సంస్థల బకాయిలు చెల్లించడానికి వెసులుబాటు లభించనుంది. 


డిస్కమ్‌లకు నిధులు తాత్కాలిక ఏర్పాటే!

ముంబై: పీఎ్‌ఫసీ, ఆర్‌ఈసీ ద్వారా డిస్కమ్‌లకు అందించే రూ.90,000 కోట్ల నిధులు తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, రానున్న కాలంలో రాష్ర్టాలపై మరింత ఒత్తిడికి ఆస్కారం ఉందని నిపుణులు అంటున్నారు. డిస్కమ్‌లకు రుణాల మంజూరు అనేది రాష్ట్ర విద్యుత్‌ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలతో అనుసంధానమై ఉన్నట్టు చెబుతున్నారు. వినియోగదారులు డిజిటల్‌ చెల్లింపులు చేసే విధంగా ప్రోత్సహించడం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన బకాయిల లిక్విడేషన్‌, డిస్కమ్‌ల నిర్వహణ, ఆర్థిక నష్టాల తగ్గింపు ప్రణాళిక వంటివి ఉన్నట్టు తెలుస్తోంది.


నెల రోజుల్లో సవరించిన టారిఫ్‌ విధానం : ఆర్‌కే సింగ్‌ 

న్యూఢిల్లీ: సవరించిన టారిఫ్‌ విధానానికి మంత్రుల బృందం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని, నెల రోజుల్లోనే దీన్ని అమలు చేసే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు. సవరించిన టారిఫ్‌ విధానం ప్రకారం..సాంకేతిక సమస్యలు, ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు మినహా ఇతర సమయాల్లో విద్యుత్‌ కోత విధిస్తే డిస్కమ్‌ కంపెనీలకు జరిమానా విధించనున్నారు. ట్రాన్స్‌మిషన్‌, డిస్ర్టిబ్యూషన్‌ నష్టాలకు నిర్దేశిత పరిమితి విధించే నిబంధన సవరించిన టారిఫ్‌ విధానంలో ఉంది. 


Updated Date - 2020-05-18T09:06:25+05:30 IST