పశ్చిమ బెంగాల్ హోం శాఖ నన్ను టార్గెట్ చేసింది : గవర్నర్ ధన్‌కర్

ABN , First Publish Date - 2020-11-21T21:04:38+05:30 IST

పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ శనివారం తీవ్ర ఆవేదన

పశ్చిమ బెంగాల్ హోం శాఖ నన్ను టార్గెట్ చేసింది : గవర్నర్ ధన్‌కర్

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ శనివారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర హోం శాఖ రాజ్యాంగ అధిపతిని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తూ, రాజ్యాంగాన్ని అవమానిస్తోందని ఆరోపించారు. ఈ పరిణామాలు రాష్ట్రంలోని బ్యూరోక్రసీ రాజకీయ చెరలో ఉన్నట్లు సూచిస్తున్నాయన్నారు. పోలీసులు, బ్యూరోక్రసీ రాజకీయాలమయం కావడం ప్రజాస్వామ్యానికి చేటు అని పేర్కొన్నారు. మాల్డా ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడుపై తాను స్పందించినందుకే ఈ విధంగా దాడి చేస్తున్నారని ఆరోపించారు. 


పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో, సుజపూర్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో నవంబరు 19న పేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై గవర్నర్ ధన్‌కర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, రాష్ట్రంలో చట్టవిరుద్ధ బాంబుల తయారీని కట్టడి చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరారు. 


గవర్నర్ ట్వీట్‌పై రాష్ట్ర హోం శాఖ స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది. మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లో పేలుడు సంభవించిందని పేర్కొంది. కొందరు బాధ్యత లేకుండా చెప్తున్నట్లుగా, చట్టవిరుద్ధ బాంబుల తయారీతో ఈ పేలుళ్లకు సంబంధం లేదని తెలిపింది. 


ఈ ట్వీట్లపై తాను రాష్ట్ర హోం శాఖ అదనపు చీఫ్ సెక్రటరీని వివరణ కోరానని గవర్నర్ తెలిపారు. రాజ్యాంగానికి, న్యాయ శాస్త్ర నియమానికి ఈ విధంగా జరిగిన అవమానాన్ని ఉపేక్షించరాదని, క్షమించరాదని తెలిపారు. 


Updated Date - 2020-11-21T21:04:38+05:30 IST