దినాజ్‌పూర్ బాధిత కుటుంబాన్ని కలుస్తాం: పశ్చిమబెంగాల్ మంత్రి
ABN , First Publish Date - 2020-07-20T03:22:04+05:30 IST
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఉత్తర దినాజ్‌పూర్ కాలాగాచ్ ప్రాంతంలో హత్యాచారానికి గురైన 16 సంవత్సరాల బాలిక కుటుంబసభ్యులను కలుస్తామని పశ్చిమబెంగాల్ మంత్రి గౌతం దేవ్ చెప్పారు.

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఉత్తర దినాజ్‌పూర్ కాలాగాచ్ ప్రాంతంలో హత్యాచారానికి గురైన 16 సంవత్సరాల బాలిక కుటుంబసభ్యులను కలుస్తామని పశ్చిమబెంగాల్ మంత్రి గౌతం దేవ్ చెప్పారు. ఘటన విషాదకరమైందన్న ఆయన దీన్ని రాజకీయం చేయదలచుకోలేదన్నారు. విచారణ జరిపి దోషులను చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పారు. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులను సీఎం మమత కలుస్తారా లేదా అనేది తెలియరాలేదు.
అంతకు ముందు బాధితురాలి కుటుంబీకులు, గ్రామస్థులు న్యాయం కోసం రోడ్డెక్కారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. వారు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పలు వాహనాలకు నిప్పుబెట్టారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా ఉండటంతో భారీగా పోలీసులను మోహరించారు.
మరోవైపు బాధితురాలు బీజేపీ బూత్ ప్రెసిడెంట్ సోదరి అని పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర శాఖ తెలిపింది. మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేకుండాపోయిందని బీజేపీ విమర్శించింది.
ఈ ఉదయం దుండగులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం హత్య చేశారు.