45 నిమిషాల పాటు ఆగిన గూగుల్!
ABN , First Publish Date - 2020-12-15T08:19:39+05:30 IST
దాదాపు అన్ని రంగాలకు చెందిన వారికి, ఏ రంగానికీ చెందని వారికి కూడా గూగుల్ లేదా గూగుల్‌కు చెందిన యూట్యూబ్, జీమెయిల్ వంటి సేవలు జీవితంలో కీలకంగా మారాయి.

జీమెయిల్, యూట్యూబ్ తదితర సేవలకు అంతరాయం
న్యూఢిల్లీ, డిసెంబరు 14: దాదాపు అన్ని రంగాలకు చెందిన వారికి, ఏ రంగానికీ చెందని వారికి కూడా గూగుల్ లేదా గూగుల్‌కు చెందిన యూట్యూబ్, జీమెయిల్ వంటి సేవలు జీవితంలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో సోమవారం 45 నిమిషాల పాటు గూగుల్ సేవలు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇబ్బంది పడ్డారు. యూట్యూబ్, జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ కేలండర్ తదితర సేవలన్నీ నిలిచిపోయాయి. అంతర్గతంగా నిల్వ సామర్థ్య సమస్యల వలన ఈ ఇబ్బం ది తలెత్తిందని, వెంటనే పరిష్కరించామని గూగుల్ తెలిపింది. ‘‘సాయంత్రం 5.17 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల గూగుల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. 6 గంటల 02 నిమిషాలకు సేవలను పునరుద్ధరించాం. అంతరాయం కలిగినందుకు క్షమాపణలు కోరుతున్నాం. ఈ సమస్య భవిష్యత్తులో తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టులోనూ గూగుల్ ఇదే తరహా సమస్యను ఎదుర్కోవడం గమనార్హం. యూట్యూబ్ ఇన్‌కాగ్నిటో విధానంలో మాత్రం కొంతమందికి పనిచేసింది.