‘రిమూవ్‌ చైనా యాప్స్‌’కు గూగుల్‌ షాక్‌

ABN , First Publish Date - 2020-06-04T07:07:39+05:30 IST

కరోనా, భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య చైనా యాప్‌లను బహిష్కరించాలనే సెంటిమెంట్‌ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అత్యంత ఆదరణ పొందిన ‘రిమూవ్‌ చైనా యాప్స్‌’ను అనే మొబైల్‌ అప్లికేషన్‌ను గూగుల్‌ తన ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది...

‘రిమూవ్‌ చైనా యాప్స్‌’కు గూగుల్‌ షాక్‌

  • ప్లే స్టోర్‌ నుంచి తొలగింపు 


న్యూఢిల్లీ జూన్‌ 3:  కరోనా, భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య చైనా యాప్‌లను బహిష్కరించాలనే సెంటిమెంట్‌ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో అత్యంత ఆదరణ పొందిన ‘రిమూవ్‌ చైనా యాప్స్‌’ను అనే మొబైల్‌ అప్లికేషన్‌ను గూగుల్‌ తన ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. ఈ యాప్‌ను రూపొందించిన వన్‌ టచ్‌ యాప్‌ ల్యాబ్స్‌ సంస్థ కూడా ఈ వార్తను ధ్రువీకరించింది. థర్డ్‌ పార్టీ యాప్‌లను తొలగించడాన్ని ప్రోత్సహించటం, మొబైల్‌ సెట్టింగ్స్‌/ఫీచర్స్‌ను మార్పు చేసుకునేలా ప్రేరేపించటం వంటివి ప్లే స్టోర్‌ విధానాలకు వ్యతిరేకం కావడంతో ఈ యాప్‌ను తొలగించినట్లు గూగుల్‌ ప్రతినిధి ఒకరు బుధవారం వెల్లడించారు. ప్రజల్లో అవగాహన కోసమే ఈ యాప్‌ను రూపొందించినట్లు వన్‌ టచ్‌ యాప్‌ ల్యాబ్స్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.  రిమూవ్‌ చైనా యాప్స్‌ మే 17న గూగుల్‌ ప్లే స్టోర్‌లో విడుదలైంది. ఇప్పటి వరకు 50 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.  అత్యధికంగా 4.9 రేటింగ్‌ పొందిన ఈ యాప్‌నకు 1.89 లక్షల రివ్యూలు వచ్చాయి. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఇది ఫోన్‌ను స్కాన్‌ చేసి అందులో ఉన్న బైట్‌ డ్యాన్సెస్‌, టిక్‌టాక్‌, యుసీ బ్రౌజర్‌ వంటి చైనా యాప్స్‌ను గుర్తించి తొలగిస్తుంది. మరోవైపు చైనా యాప్‌ టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన మిత్రో వీడియో షేరింగ్‌ యాప్‌ను కూడా గూగుల్‌  ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. భద్రతా కారణాల రీత్యా ఈ యాప్‌ను తొలగించినట్లు సమాచారం. 


Updated Date - 2020-06-04T07:07:39+05:30 IST