గూగుల్ ఫొటోస్.. ఉచితం కాదు!
ABN , First Publish Date - 2020-11-13T08:55:40+05:30 IST
గూగుల్ ఫొటోస్ వినియోగదారులకు చెడ్డవార్త. హైక్వాలిటీ ఫొటోలను దాచుకోవడానికి ఇన్నాళ్లుగా కల్పించిన ‘ఉచిత అపరిమిత స్టోరేజీ’ సౌకర్యానికి గూగుల్...
- 2021 జూన్ 1 నుంచి 15 జీబీలో భాగమే
- అప్పటిదాకా ఎన్నైనా అప్‌లోడ్ చేసుకోవచ్చు
- హైక్వాలిటీ ఫొటోల విధానంలో మార్పు
న్యూఢిల్లీ, నవంబరు 12: గూగుల్ ఫొటోస్ వినియోగదారులకు చెడ్డవార్త. హైక్వాలిటీ ఫొటోలను దాచుకోవడానికి ఇన్నాళ్లుగా కల్పించిన ‘ఉచిత అపరిమిత స్టోరేజీ’ సౌకర్యానికి గూగుల్.. వచ్చే ఏడాది జూన్ 1 నుంచి ముగింపు పలకబోతోంది. అప్పటిదాకా మీరు గూగుల్ ఫొటో్‌సలోకి అప్‌లోడ్ చేసే ‘హై క్వాలిటీ’ ఫొటోలను కూడా ఉచిత స్టోరేజీలో భాగంగానే పరిగణిస్తుంది. ఆ తర్వాత అప్‌లోడ్ చేసే చిత్రాలు, వీడియోలను మాత్రం.. మీరు వాడే గూగుల్ ఖాతా తాలూకూ 15జీబీ స్టోరేజీ స్పేస్‌లో భాగంగా పరిగణిస్తుంది. అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే.. గూగుల్ ఫొటోస్ యాప్ విధానాల ప్రకారం.. రెండు రకాల ఫొటోలను మనం దాంట్లోకి అప్‌లోడ్ చేయవచ్చు. ఒకటి.. హైక్వాలిటీ చిత్రాలు, వీడియోలు. రెండు.. ఒరిజినల్ చిత్రాలు, వీడియోలు. ఉదాహరణకు.. 16 మెగాపిక్సెల్ కన్నా తక్కువ నాణ్యతతో కూడిన ఒక చిత్రం 7ఎంబీ పరిమాణం(4032x3024)లో ఉందనుకోండి. దాన్ని మీరు గూగుల్ ఫొటో్‌సలోకి అప్‌లోడ్ చేసినప్పుడు దాని పరిమాణం 1 ఎంబీకి (4032x3024) కుదించుకుపోతుంది.
పరిమాణం తగ్గినా చూడటానికి అసలు చిత్రంలాగానే ఉంటుంది. అదే మీరు మీ ఫొటో పరిమాణం 7 ఎంబీతోనే గూగుల్ ఫొటో్‌సలో సేవ్ చేయాలనుకుంటే దాన్ని ఒరిజినల్ ఫొటోగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఉన్న గూగుల్ ఫొటోస్ విధానం ప్రకారం.. హైక్వాలిటీ ఫొటోల స్టోరేజీ అపరిమితం, ఉచితం. ఒరిజినల్ పరిమాణంలో సేవ్ చేయాలనుకుంటే మాత్రం దాన్ని జీమెయిల్ ఖాతాతోపాటు ఉచితంగా వచ్చే 15 జీబీ స్టోరేజీలో భాగంగా పరిగణిస్తారు. ఇప్పుడు గూగుల్ కొత్తగా చేయబోతున్నదేంటంటే.. జూన్ 1 నుంచి మీరు అప్‌లోడ్ చేసే హైక్వాలిటీ చిత్రాలను, వీడియోలను కూడా ఆ స్టోరేజీలోనే భాగంగా పరిగణిస్తారు. 15 జీబీ పరిమితి దాటితే డబ్బు చెల్లించి గూగుల్ వన్ సభ్యత్వం తీసుకోవాలి.
గూగుల్ సంస్థ తయారుచేసిన పిక్సెల్ ఫోన్ల వినియోగదారులకు మాత్రం ‘హైక్వాలిటీ’ చిత్రాలను అపరిమితంగా అప్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కొనసాగిస్తారు. తమ ఫోన్లను వాడుతున్నందుకు కృతజ్ఞతగా గూగుల్ సంస్థ వారికి ఆ మినహాయింపునిచ్చింది. కా గా.. చాలామంది హైక్వాలిటీ చిత్రాలనే అప్‌లోడ్ చే స్తారు కాబట్టి.. తమ వినియోగదారుల్లో ఇంకా 80శాతం మందికి 15 జీబీ స్టోరేజీ సగం కూడా నిండలేదని, వారికి మరో మూడేళ్లపాటు హైక్వాలిటీ చిత్రాలను ఉ చితంగా అప్‌లోడ్ చేసుకోవడానికి కావాల్సినంత స్టోరే జీ ఉందని గూగుల్ సంస్థ పేర్కొంది. కా గా.. కనీసం రెండేళ్లుగా తెరవని(సైన్‌ఇన్ కాని) ఖాతాల్లోని డేటాను డిలీట్ చేసేలా విధానాల్లో మార్పులు చేసింది.