అమ్మాయిలపై మహిళా కమిషన్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-12-12T03:23:49+05:30 IST

మహిళలు, యువతులపై చత్తీస్‌గఢ్ మహిళా కమిషన్ చైర్మన్ కిరణ్మయి నాయక్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకాభిప్రాయంతో...

అమ్మాయిలపై మహిళా కమిషన్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

రాయ్‌పూర్: అత్యాచారం కేసులు పెడుతున్న మహిళలు, యువతులపై చత్తీస్‌గఢ్ మహిళా కమిషన్ చైర్మన్ కిరణ్మయి నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకాభిప్రాయంతో సంబంధాలు కొనసాగించి, కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత... తమ భాగస్వాములపై కొందరు మహిళలు, యువతులు అత్యాచార కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ‘‘వివాహమైన వ్యక్తి ఎవరైనా ప్రేమ పేరుతో తమను వలలో వేసుకునేందుకు ప్రయత్నిస్తే.. వాళ్లు చెబుతున్నవి అబద్ధాలు అని అమ్మాయిలు పసిగట్టాలి. అలాంటి వాళ్లు తమకు ఏ విధంగానూ సాయం చేయరని గుర్తుంచుకోవాలి. నేరుగా వెళ్లి అలాంటి వారిపై పోలీసులకు ముందుగానే ఫిర్యాదు చేయాలి. చాలా కేసుల్లో ఇరువురూ ఏకాభిప్రాయంతో సంబంధం కొనసాగించిన తర్వాత, కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత.. అప్పుడు వచ్చి అత్యాచారం కేసులు పెడుతున్నారు...’’ అని ఆమె అన్నారు. ‘‘అలాంటి సంబంధాలు’’ పెట్టుకోవద్దనీ.. వాటి వల్ల ఏమాత్రం మంచి జరగదని కిరణ్మయి హెచ్చరించారు. ‘‘ముందు మీ సంబంధాలు, పరిస్థితులను సరిచూసుకోవాలని మహిళలను కోరుతున్నాను. ఒకవేళ మీరు అలాంటి సంబంధంలోకి అడుగుపెడితే.. ఫలితం ఎప్పుడూ చెడుగానే ఉంటుంది...’’ అని ఆమె అన్నారు.


కాగా అమ్మాయిలు తమ చదువులు పూర్తి కాకుండా పెళ్లి మీద దృష్టి పెట్టొద్దని కూడా కిరణ్మయి పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. 18 నిండగానే అమ్మాయిలు పెళ్లి చేసుకుని, ఓ బిడ్డను ఎత్తుకుని మా దగ్గరికి వస్తున్నారు. అయితే ముందు అమ్మాయిలు తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, ఏదైనా బాధ్యత కలిగి ఉంటే.. వాళ్లను పెళ్లి చేసుకునే వాళ్లు కూడా బాధ్యతగా మెలుగుతారు..’’ అని కిరణ్మయి అన్నారు. కాగా ఆమె వ్యాఖ్యలపై స్పందించేందుకు చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘెల్ నిరాకరించారు. ఆమె రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నందున తాను ఎలాంటి ప్రకటనా చేయబోనని సీఎం స్పష్టం చేశారు. ‘‘దీనిపై నేను స్పందించ దల్చుకోలేదు. అది రాజ్యాంగబద్దమైన పోస్టు. ఆమె ఏదైనా చెప్పారు అంటే.. తన అనుభవాల్లో నుంచి గానీ లేదా అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి మాత్రమే చెబుతారు...’’ అని బాఘెల్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-12T03:23:49+05:30 IST