అహ్మద్ పటేల్ స్థానాన్ని భర్తీ చేయనున్న అశోక్ గెహ్లోత్!

ABN , First Publish Date - 2020-11-26T20:48:45+05:30 IST

కాంగ్రెస్ చాణక్యుడు అహ్మద్ పటేల్ కన్నుమూశారు. మరి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అంతటి వ్యూహాన్ని

అహ్మద్ పటేల్ స్థానాన్ని భర్తీ చేయనున్న అశోక్ గెహ్లోత్!

న్యూఢిల్లీ : కాంగ్రెస్ చాణక్యుడు అహ్మద్ పటేల్ కన్నుమూశారు. మరి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అంతటి వ్యూహాన్ని ఎవరు పన్నుతారు? అంత నమ్మకస్థునిలా ఏ నేత వ్యవహరిస్తారు? ఇవన్నీ సగటు కాంగ్రెస్ కార్యకర్తను, నేతలను తొలుస్తున్న ప్రశ్నలే. సముద్రపు నీరు కొత్త కొత్త వాటిని తీరానికి తీసుకొచ్చినట్లు... కాలమూ కొత్త కొత్త నేతలను తెరపైకి తెస్తుంటుంది. అహ్మద్ పటేల్ స్థానాన్ని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ పూరించనున్నారని రాజకీయ విశ్లేషకులు, కాంగ్రెస్ గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్న వారు అంటున్నారు. సీనియర్ నేత కపిల్ సిబాల్ కాంగ్రెస్ పై బహిరంగంగానే విమర్శలు చేస్తే కాంగ్రెస్ నేతలెవ్వరూ ఘాటుగా స్పదించలేదు. మొదటి సారి కపిల్ సిబాల్‌పై విరుచుకుపడింది అశోక్ గెహ్లాటే. ‘‘పార్టీ అంతర్గత విషయాలు బహిరంగంగా చర్చించాల్సిన అవసరం సిబల్‌కు ఏమొచ్చింది? ఇలాంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి’’ అని విరుచుకుపడ్డారు.


ఇక రెండో విషయం... లవ్ జిహాద్ విషయంలోనూ కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులెవ్వరూ స్పందించక ముందే గెహ్లోత్ స్పందించారు. ‘‘లవ్ జిహాద్ అనే పదాన్ని బీజేపీయే సృష్టించింది. దేశంలోని మత సామరస్యాన్ని చెడగొడుతోంది. పెళ్లి అనేది వ్యక్తిగతం’’ అంటూ గెహ్లోత్ వ్యాఖ్యానించారు. ఇలా కాంగ్రెస్ తరపున మొట్ట మొదటగా స్పందించడంతో అధిష్ఠానం కూడా సంతృప్తిని వ్యక్తం చేసిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ క్లిష్టంగా ఉన్న సమయంలో ట్రబుల్ షూటర్‌గా గెహ్లోత్ అవతారమెత్తుతున్నారని, అందుకు రాహుల్ గాంధీ కూడా పూర్తిగా సహకరిస్తున్నట్లు సమాచారం.


మామూలుగా అహ్మద్ పటేల్ పాత తరం రాజకీయాలను ఫాలో అవుతారని ప్రచారం ఉంది. పార్టీ లైన్‌ను ఏమాత్రం దాటకుండా వ్యవహారాలను చక్కబెడతారని పేరుంది. ఇంత పద్ధతి ప్రకారం నడుచుకున్నా... రాజకీయ సర్కిల్‌లో గానీ, అటు కార్పొరేట్ సర్కిల్స్‌లో గానీ అహ్మద్ పటేల్‌కు ఏమాత్రం ప్రాభవం తగ్గలేదు. వారందరూ ఆయన్ను ‘‘అహ్మద్ భాయ్’ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే... అహ్మద్ పటేల్ అనుసరిస్తున్న ‘పాత పద్ధతి’ రాహుల్ గాంధీకి ఏమాత్రం రుచించదు. సోనియా - అహ్మద్ పటేల్ జోడి కాంగ్రెస్ రాజకీయాలకు కుదిరింది కానీ... అహ్మద్ పటేల్- రాహుల్ జోడి ఏమాత్రం కుదరదని రాహుల్ గాంధీ ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అత్యంత దూకుడుగా వ్యవహరించే గెహ్లోత్ వ్యక్తిత్వమే రాహుల్ ను ఆకర్షించిందట.


అసలు అహ్మద్ పటేల్‌ను పక్కనపెట్టాలని రాహుల్ గాంధీ మెళ్లి మెళ్లిగా ప్రయత్నాలు కూడా ప్రారంభించారని కూడా ప్రచారం ఉంది. కానీ అనారోగ్యం కారణంగా అహ్మద్ పటేల్ మరణించారు. అంతేకాకుండా పార్టీ పగ్గాలను సోనియా గాంధీ రేపోమాపో రాహుల్ గాంధీకి అప్పజెప్పనున్నారు. ఇక... పార్టీలో రాహుల్ శకం ప్రారంభం కానుంది. రాహుల్ వ్యక్తులూ తెరపైకి రానున్నారు.  కార్యక్షేత్రాన్ని బాగా ఆకళింపు చేసుకున్న వ్యక్తిగా, ఓ మాస్టర్ వ్యూహకర్తగా అశోక్ గెహ్లోత్ వ్యవహరిస్తున్నారు కాబట్టి... ఇకపై అహ్మద్ పటేల్ స్థానంలో గెహ్లోత్ కొనసాగే అవకాశాలున్నాయి. వీటితో పాటు రాహుల్ గాంధీ, గెహ్లోత్ మధ్య కూడా చాలా మంచి సంబంధాలున్నాయి. అంతేకాకుండా రాహుల్‌కు అత్యంత నమ్మకస్థుడిగా కూడా గెహ్లోత్ పేరు గడించారు.


గుజరాత్ ఎన్నికల బాధ్యతలను గెహ్లోత్‌కు అప్పగిస్తే... వాటిని విజయంతంగా పూర్తి చేశారని రాహుల్ దగ్గర మంచి పేరు కూడా సంపాదించారు. ఇక... కాంగ్రెస్ పార్టీలోని అందరి సీనియర్లతోనూ గెహ్లోత్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. గెహ్లోత్ అర్ధరాత్రి ఏ నేతకు ఫోన్ చేసినా వారందరూ ఆయన ఫోన్‌కు స్పందిస్తారు. అంతేకాకుండా క్రింది స్థాయి నుంచి బలంగా ఎదిగిన నేతగా పేరుంది. అహ్మద్ పటేల్ లాగా గెహ్లోత్ కూడా ప్రచారానికి, ఆర్భాటానికి దూరంగా ఉంటారు. ఈ కారణాల రీత్యా రాహుల్ టీంలో గెహ్లోత్ చేరిపోనున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. అహ్మద్ పటేల్ మనసులో ఏముందో కనుక్కోవడం ప్రతి ఒక్కరికీ కష్టమేనని, అచ్చు గెహ్లోత్ మనసులో కూడా ఏముందో కనుక్కోవడం అంతే కష్టమని పార్టీ సీనియర్లు అంటున్నారు. ఒకవేళ రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టినా... గెహ్లోత్‌ను ఢిల్లీకి పిలిపించుకోరని, సీఎంగా కొనసాగిస్తూనే... అక్కడి నుంచే సలహాలను, వ్యూహాలను రాహుల్ స్వీకరిస్తారని రాహుల్ టీం సభ్యులు అంటున్నారు. వీటన్నింటి దృష్ట్యా... పార్టీలోకి మరో అహ్మద్ పటేల్ వచ్చేసినట్లేనని రాహుల్ టీం పేర్కొంటోంది. Updated Date - 2020-11-26T20:48:45+05:30 IST