కొవిడ్‌ కట్టడిలో మోదీ సర్కారు భేష్‌!

ABN , First Publish Date - 2020-08-11T07:11:12+05:30 IST

కరోనాపై పోరులో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీసుకుంటున్న చర్యల పట్ల గ్రామీణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా అష్టకష్టాలు పడుతున్నప్పటికీ గ్రామీణప్రాంతాల్లో అత్యధికులు కేంద్రం, రాష్ట్రాలు చేపట్టిన చర్యలు...

కొవిడ్‌ కట్టడిలో మోదీ సర్కారు భేష్‌!

  • కేంద్రం చేపట్టిన చర్యలు బాగున్నాయి
  • రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలూ ఓకే
  • గవోన్‌ కనెక్షన్‌ మీడియా సర్వేలో వెల్లడి 

న్యూఢిల్లీ, ఆగస్టు 10: కరోనాపై పోరులో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తీసుకుంటున్న చర్యల పట్ల గ్రామీణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా అష్టకష్టాలు పడుతున్నప్పటికీ గ్రామీణప్రాంతాల్లో అత్యధికులు కేంద్రం, రాష్ట్రాలు చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా ఉన్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా గవోన్‌ కనెక్షన్‌ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో 74 శాతం మంది గ్రామీణులు కొవిడ్‌-19 కట్టడికి మోదీ సర్కారు చేపట్టిన చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు బాగున్నాయంటూ 78 శాతం మంది చెప్పారు. మే 30 నుంచి జూలై 16 మధ్య దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 25,731 మందిని ఇంటర్వ్యూ చేశారు. ఈ అధ్యయనాన్ని ఢిల్లీకి చెందిన లోక్‌నీతి- సీఎ్‌సడీఎస్‌ బృందం విశ్లేషించింది. మోదీ సర్కారు చర్యలకు మద్దతు పలికిన వారిలో 37 శాతం మంది తాము అత్యంత సంతృప్తి చెందినట్లు తెలపగా.. 37 శాతం మంది సంతృప్తికరంగా ఉన్నట్లు చెప్పారు. 14 శాతం మందికిపైగా ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు అధ్యయన సంస్థ వెల్లడించింది. లాక్‌డౌన్‌, కొవిడ్‌ కట్టడి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కంటే కాస్త ఎక్కువగానే మద్దతు తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ప్రజలు మోదీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై కాస్త తక్కువగా సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. లాక్‌డౌన్‌లో నడుచుకుంటూ సొంతూళ్లకు తిరిగి వచ్చిన వారిలో 33 శాతం మంది తిరిగి పనుల కోసం నగరాలకు వెళ్తామని చెప్పడం విశేషం. ఇక సర్వే చేసిన ప్రతి 8 గ్రామీణ కుటుంబాల్లో ఒకటి లాక్‌డౌన్‌ సమయంలో తమ వద్ద డబ్బుల్లేక తరచూ పస్తులుండాల్సి వచ్చిందని చెప్పినట్లు గవోన్‌ కనెక్షన్‌ సంస్థ వెల్లడించింది. 


Updated Date - 2020-08-11T07:11:12+05:30 IST