గల్వాన్‌ నదికి ఆ పేరెలా వచ్చిందంటే..

ABN , First Publish Date - 2020-06-19T08:21:29+05:30 IST

కశ్మీర్‌లోని ఈశాన్య ప్రాంతంలో 80 కిలోమీటర్ల పొడవైన గల్వాన్‌ నది పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది నెలల్లో ఈ నది పరివాహక ప్రాంతంలో భారత్‌, చైనా సైనికులు ఘర్షణలకు...

గల్వాన్‌ నదికి ఆ పేరెలా వచ్చిందంటే..

శ్రీనగర్‌/న్యూఢిల్లీ, జూన్‌ 18: కశ్మీర్‌లోని ఈశాన్య ప్రాంతంలో 80 కిలోమీటర్ల పొడవైన గల్వాన్‌ నది పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది నెలల్లో ఈ నది పరివాహక ప్రాంతంలో భారత్‌, చైనా సైనికులు ఘర్షణలకు పాల్పడ్డారు. ఇటీవలే 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే.  లేహ్‌కు చెందిన అన్వేషకుడు గులామ్‌ రసూల్‌ గల్వాన్‌ అనే వ్యక్తి పేరును ఈ నదికి పెట్టారు. కొత్త ప్రదేశాల అన్వేషణ, సాహసయాత్రలపై రసూల్‌కు చిన్నప్పటి నుంచి ఆసక్తి. 12 ఏళ్లు ఉన్నపుడు 1890లో కెప్టెన్‌ ఫ్రాన్సిస్‌ ఎడ్వర్డ్‌ యంగ్‌హస్బెండ్‌తో కలిసి ఆయన యార్కండ్‌ అనే ప్రదేశానికి వెళ్లారు. 


21 ఏళ్లు వచ్చేసరికి గల్వాన్‌ నదీ ప్రవాహాన్ని అనుసరిస్తుండేవారు. అనంతరం కశ్మీర్‌లోని ఉత్తర ప్రాంతంలో చాంగ్‌ చెన్మో లోయలో సాహసయాత్రకు వెళ్లిన బ్రిటిష్‌ బృందం వాహనానికి ఆయన ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. తన చివరి సంవత్సరాల్లో బ్రిటిష్‌ జాయింట్‌ కమిషనర్‌కు ఆయన స్థానిక ముఖ్య సహాయకుడిగా నియమితులయ్యారు. అలా ఆయన పేరు మీద నదికి గల్వాన్‌ నది అని నామకరణం చేశారు. గల్వాన్‌ లోయ భారత్‌కే చెందుతుందని, 200 ఏళ్లకుపైగా ఈ ప్రాంతం భారత్‌దేనని గల్వాన్‌ మనుమడు అమీన్‌ గల్వాన్‌ తెలిపారు. కాగా, దురాక్రమణను చైనా ఆపడం లేదు. గల్వాన్‌ నదిని అడ్డుకోవడానికి, లేదా దాని ప్రవాహాన్ని మళ్లించడానికి చైనా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. 


Updated Date - 2020-06-19T08:21:29+05:30 IST