గెహ్లాట్ క్యాంప్ ఎమ్మెల్యేలు ఏంచేస్తున్నారంటే..

ABN , First Publish Date - 2020-07-18T21:42:43+05:30 IST

సంఖ్యాబలం విషయంలో సమస్యలు తలెత్తినప్పుడల్లా క్యాంపు రాజకీయాలకు తెరలేవడం ప్రభుత్వాలకు పరిపాటైంది. తమ ఎమ్మెల్యేలను..

గెహ్లాట్ క్యాంప్ ఎమ్మెల్యేలు ఏంచేస్తున్నారంటే..

జైపూర్: సంఖ్యాబలం విషయంలో సమస్యలు, రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు క్యాంపు రాజకీయాలకు తెరలేవడం ప్రభుత్వాలు, ప్రధాన పార్టీలకు పరిపాటే. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోందంటూ బహిరంగంగానే విమర్శలు చేసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇటీవల సీఎల్‌పీ సమావేశానంతరం క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఎమ్మెల్యేలు చేజారకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈవారం ప్రారంభంలో జైపూర్‌లోని ఫైర్‌మాంట్ ఐదు నక్షత్రాల రిసార్ట్‌కు తరలించారు. దీంతో తమకు దొరికిన ఈ విశ్రాంతిని ఎమ్మెల్యేలు ఆటపాటల్లో గడుపుతున్నారు.


పలువురు ఎమ్మెల్యేలు యోగా నేర్చుకుంటుండగా, మరికొందరు సినిమాలతో కాలక్షేపం చేస్తున్నారు. హోటల్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ వద్ద పాస్తా, ఇతర వంటకాల తయారీని చూసి నేర్చుకుంటున్నారు. 1960 దశకంలో పెద్ద హిట్‌గా నిలిచిన 'మొఘల్ ఇ ఆజం' సినిమాను ఎమ్మెల్యేలకు కోసం ప్రదర్శించారు.


ఇది ఎమ్మెల్యేల బాద్యతారాహిత్యం: బీజేపీ

కాగా, ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు ఐదు నక్షత్రాల రిసార్ట్‌‌లో గడుపుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారని బీజేపీ నేత సంబిత్ పాత్ర విమర్శలు గుప్పించారు. మూవీ నైట్లు, కిట్టీ పార్టీలతో ఎమ్మెల్యేలు గడుపుతున్నారని, కాంగ్రెస్ తరహా పాలన ఇదేనా అని ప్రశ్నించారు. లగ్జరీ సదుపాయాలు అనుభవిస్తూ తమను గెలిపించిన ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారని ఆయన విమర్శించారు.

Updated Date - 2020-07-18T21:42:43+05:30 IST