చైనాతో వివాదంపై పూర్తి సమాచారం బయటపెట్టాలి: మన్మోహన్ సింగ్

ABN , First Publish Date - 2020-06-22T18:34:35+05:30 IST

చైనాతో వివాదంపై పూర్తి సమాచారం బయట పెట్టాలని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు.

చైనాతో వివాదంపై పూర్తి సమాచారం బయటపెట్టాలి: మన్మోహన్ సింగ్

న్యూఢిల్లీ: చైనాతో వివాదంపై పూర్తి సమాచారం బయట పెట్టాలని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ డిమాండ్ చేశారు. సమాచారం దాచడం సమర్థ నాయకత్వానికి ప్రత్యామ్నాయం కాదని అన్నారు. చైనాతో సమస్య ముదరకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గల్వాన్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణకు సంబంధించి భారత ప్రభుత్వం నిజాలను దాచిపెడుతోందని, సరైన సమాచారం ఇవ్వడలేదన్నారు.


తప్పుడు సమాచారం ఇవ్వడం సమర్థవంతమైన నాయకత్వానికి శోభనివ్వదన్నారు. కాబట్టి నిజా నిజాలను ప్రజల ముందుంచాలని మన్మోహన్ డిమాండ్ చేశారు. అమరవీరుల త్యాగాలను వృధాపోనీయకూడదని... జవాన్ల త్యాగాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే అమరజవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.

గాల్వాన్ లో మరణించిన సైనికులకు న్యాయం జరిగేలా చూడాలని, భారత ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే ప్రజల విశ్వాసానికి ద్రోహం చేసినట్టేనని తెగేసి చెప్పారు. చైనా బెదిరింపులకు ఏమాత్రం భయపడకూడదని, దేశ ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీపడకూడదని సూచించారు.

‘‘గాల్వాన్ లోయలో మనం 20 మంది ధైర్యవంతులైన వారిని కోల్పోయాం. తమ సర్వస్వాన్నీ త్యాగం చేశారు. వారు ధైర్యంతో చివరి శ్వాస వరకూ మాతృభూమిని రక్షించడానికే ప్రయత్నించారు. వారికి, వారి కుటుంబాలకు మా కృతజ్ఞతలు’’ అంటూ పేర్కొన్నారు. ఈ సమయంలో మనం చరిత్రాత్మకమైన కూడలి వద్ద నిలబడ్డామని, ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలు భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతాయని మన్మోహన్ స్పష్టం చేశారు. Updated Date - 2020-06-22T18:34:35+05:30 IST