పెళ్లికి కట్నంగా గ్రామ ప్రజలకు భార్య ఉచిత వైద్యం!
ABN , First Publish Date - 2020-03-02T14:35:53+05:30 IST
‘నా భార్య గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్యం చేయాలి’

- సబ్ కలెక్టర్‌కు పలువురి ప్రశంసలు
చెన్నై : తన వివాహానికి వరకట్నంగా ‘నా భార్య గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్యం చేయాలి’ అని పెళ్లి పీటల మీద ప్రకటించిన తిరునల్వేలి సబ్ కలెక్టర్ పలువురి ప్రశంసలందుకుంటున్నారు. తంజావూరు జిల్లా పేరావూరణి సమీపంలోని వట్టంగాడు గ్రామానికి చెందిన శివగురు ప్రభాకరన్ ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేసి 2018లో ఐఏఎస్ పరీక్ష రాసి జాతీయస్థాయిలో 101వ స్థానాన్ని, రాష్ట్రస్థాయిలో 3వ స్థానంలో నిలిచి ఐఏఎస్ అధికారి అయ్యారు. ప్రస్తుతం ఆయన తిరునల్వేలి జిల్లా సబ్ కలెక్టర్‌గా వ్యవహరిస్తూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గ్రామ అభివృద్ధి బృందాలను ఏర్పాటుచేసి పలురకాల సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలుపరుస్తున్నా రు. ఈ నేపథ్యంలో, ఆయనకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు వధువు ఎంపిక కోసం ప్రయత్నాల్లో దిగారు.
తనకు నగలు, కారు తదితర వరకట్నాలు లేకుండా మహిళా డాక్టర్ కావాలని, ఆమె గ్రామప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించాలని శివగురు ప్రభాకరన్ కుటుంబీకులను కోరారు. ఇందుకు సమ్మతించిన చెన్నైకి చెందిన డాక్టర్ కృష్ణభారతితో వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. గత నెల 26వ తేదీ రెండు కుటుంబాల పెద్దలు, బంధువు, స్నేహితుల సమక్షంలో కృష్ణభారతి- శివగురు ప్రభాకరన్‌ల వివాహం ఘనంగా జరిగింది. వరకట్నం తీసుకోకుండా వైద్యురాలిగా ఉన్న తన సతీమణిని సమాజానికి ఉచిత సేవలు అందించాలని కోరిన సబ్ కలెక్టర్‌ను వివాహ వేడుకలో పాల్గొన్న వారంతా ప్రశంసలతో ముంచెత్తారు.