ఉచిత బియ్యం, పప్పు, రూ.1000: తమిళ సర్కార్ రిలీఫ్ ప్యాకేజీ ఇదే!

ABN , First Publish Date - 2020-03-24T22:28:53+05:30 IST

రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులందరికీ ఉచిత బియ్యం, పప్పు, వంటనూనె, చక్కెరతోపాటు వెయ్యి

ఉచిత బియ్యం, పప్పు, రూ.1000: తమిళ సర్కార్ రిలీఫ్ ప్యాకేజీ ఇదే!

చెన్నై: రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులందరికీ ఉచిత బియ్యం, పప్పు, వంటనూనె, చక్కెరతోపాటు వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ఈ రోజు అసెంబ్లీలో ప్రకటించారు. ఏప్రిల్ నెలకుగాను వీటిని పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. రేషన్ దుకాణాల్లో రద్దీని నివారించేందుకు టోకెన్ విధానాన్ని అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే, ఈ ఉపశమన ప్యాకేజీ వద్దనుకునేవారు సంబంధిత వెబ్‌సైట్‌ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. అలాగే, మార్చినెల రేషన్ పొందలేకపోయిన వారు ఏప్రిల్ నెల రేషన్‌తో కలిపి తీసుకోవచ్చన్నారు.  


రాష్ట్రంలో 144  సెక్షన్ అమలు చేస్తుండడంతో రోజువారీ, వ్యవసాయ,  నిర్మాణ రంగ కార్మికులు, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, వీధి వ్యాపారులు, సీనియర్ సిటిజన్లు, ఇతర వ్యవస్థీకృత రంగాలకు చెందిన వారు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రిలీఫ్ ప్యాకేజీ కోసం మొత్తంగా రూ.3280 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. నిర్మాణ రంగ కార్మికులు, ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా వెయ్యి రూపాయలు, 15 కేజీల బియ్యం, కేజీ పప్పు, కిలో వంట నూనె పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.


నిర్మాణ రంగానికి చెందిన వలస కార్మికులను జిల్లా కలెక్టర్లు, లేబర్ డిపార్ట్‌మెంట్ అధికారులు గుర్తిస్తారని, వారికి 15 కేజీల బియ్యం, కిలో ఉప్పు, కిలో వంట నూనె అందిస్తారని వివరించారు. రిజిస్టర్ చేసుకున్న వీధి వ్యాపారులకు అదనంగా వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్టు పళనిస్వామి వివరించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మార్చి నెలలో పనిచేసిన వారికి రెండు రోజుల బోనస్ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు. 

Updated Date - 2020-03-24T22:28:53+05:30 IST