ప్రణబ్‌దా ఇక లేరు
ABN , First Publish Date - 2020-09-01T07:34:21+05:30 IST
ఢిల్లీలోని సైనిక ఆస్పత్రిలో తుది శ్వాస.. మెదడులో క్లాట్‌తో ఆగస్టు 10న ఆస్పత్రికి భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ప్రచార వ్యూహకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అపరచాణక్యుడు...

ఢిల్లీలోని సైనిక ఆస్పత్రిలో తుది శ్వాస.. మెదడులో క్లాట్‌తో ఆగస్టు 10న ఆస్పత్రికి భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ప్రచార వ్యూహకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఎదిగిన అపరచాణక్యుడు.. రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ నిబంధనలను ఔపోసన పట్టిన రాజకీయ దురంధరుడు.. ప్రపంచంలోనే ఐదుగురు అత్యుత్తమ ఆర్థిక మంత్రుల్లో ఒకరుగా కితాబు అందుకున్న మేధావి.. సంకీర్ణ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుంటూ, వివిధ పార్టీలు, వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించిన సంక్షోభ పరిష్కర్త.. ఆర్థిక సంస్కరణలకు ముందు.. తర్వాత.. ఆర్థిక మంత్రిగా దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించిన భారత రత్న.. రాజకీయ కురువృద్ధుడు.. ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు! అనేకానేక రాజకీయ యుద్ధాల్లో ఆరితేరిన ఆ యోధుడు.. మృత్యువుతో 21 రోజులపాటు చేసిన పోరాటంలో అలసి సొలసి.. సోమవారం సాయంత్రం మరలిరాని లోకాలకు తరలిపోయారు!!
- వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
- అదే రోజు బ్రెయిన్ సర్జరీ చేసిన వైద్యులు
- 21 రోజులుగా కోమాలో వెంటిలేటర్‌పైనే
- సెప్సిస్ తీవ్రమై ఆదివారానికి సెప్టిక్ షాక్
- కార్డియాక్ అరెస్టుతో సోమవారం
- సాయంత్రం 4:30 గంటలకు కన్నుమూత
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు,
- కాంగ్రెస్, విపక్ష నేతల సంతాపం
- ఏడు రోజులు సంతాప దినాలు
- నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
- మార్గదర్శనం చేసి.. ఆశీర్వదించారు: ప్రధాని
- ప్రణబ్ నుంచి ఎంతో నేర్చుకున్నా: సోనియా
- ఆయన గొప్ప మానవతావాది: తమిళిసై
- ప్రణబ్ సేవలు దేశానికి గర్వకారణం: అమిత్ షా
న్యూఢిల్లీ, ఆగస్టు 31: భారత రత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) ఇక లేరు. మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు.. కరోనా వైరస్ కూడా సోకడంతో ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 4.30 గంటలకు కార్డియాక్ అరెస్టుతో తుది శ్వాస విడిచారు. మెదడు రక్తనాళాల్లో గడ్డ (క్లాట్) ఉండడంతో శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఆగస్టు 10న ఆస్పత్రికి వెళ్లిన ప్రణబ్‌కు పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ట్విటర్‌లో ఆయనే స్వయంగా తెలియజేశారు. అదేరోజు ఆయనకు ఆర్మీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. సర్జరీ విజయవంతమైందని కూడా వైద్యులు ప్రకటించారు. కానీ, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుండకపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం కొనసాగించారు. కరోనా కారణంగా ఆయన ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. తర్వాత ఆయన మూత్రపిండాల పనితీరు మందగించింది. క్రమంగా రక్తం విషపూరితమై (సెప్సిస్), ఆదివారంనాడు సెప్టిక్ షాక్‌తో బాధపడ్డారని.. సోమవారం (ఆగస్టు 31న) కార్డియాక్ అరెస్టుతో మరణించారని వైద్యులు తెలిపారు. సర్జరీ అయినప్పటి నుంచీ కోమాలో వెంటిలేటర్‌పైనే ఉన్న ప్రణబ్ కన్నుమూసినట్టు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విటర్ ద్వారా తెలిపారు. ప్రణబ్ భార్య సువ్ర ముఖర్జీ 2015లోనే మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఇంద్రజిత్, అభిజిత్, కుమార్తె శర్మిష్ట ఉన్నారు. కాగా.. ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపసూచకంగా పార్లమెంటు, రాష్ట్రపతి భవన్ సహా ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలను అవనతం చేశారు.
సెప్టిక్ షాక్ అంటే?
ప్రణబ్ ముఖర్జీ సెప్టిక్ షాక్‌తో మరణించినట్లు వైద్యులు తెలిపారు. సెప్టిక్ షాక్ అంటే ఏమిటంటే.. బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు.. వాటిపై పోరాటంలో భాగంగా శరీరం రక్తంలోకి కొన్ని రసాయనాలను విడుదల చేస్తుంది. ఆ రసాయనాల మోతాదు పెరిగిపోయినప్పుడు రక్తం విషపూరితమైపోతుంది. ఈ స్థితిని సెప్సిస్ అంటారు. అది తీవ్ర సెప్సి్‌సకు, అంతిమంగా సెప్టిక్ షాక్‌కు దారి తీస్తుంది. ఆ దశలో.. రక్తపోటు ప్రమాదకరస్థాయులకు పడిపోతుంది. శరీరంలోని పలు కీలక అవయవాలకు ఆక్సిజన్ అందక అవి దెబ్బతింటాయి. గుండె, రక్తప్రసరణ వ్యవస్థ పనిచేయడం మానేస్తాయి. చివరకు మరణిస్తారు.
దేశానికి ఆయన అందించిన సేవలకు నివాళిగా కేంద్రం ఏడు రోజులు (ఆగస్టు 31-సెప్టెంబరు 6) సంతాపదినాలుగా ప్రకటించింది. ఈ ఏడు రోజుల్లో అధికారికంగా ఎలాంటి వినోద కార్యక్రమాలూ ఉండబోవని తెలిపింది. 2007లో ప్రణబ్ బెంగాల్లో ముర్షీదాబాద్ నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా ఆయన కారును ఓ ట్రక్కు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన తలకు గాయాలయ్యాయి. చికిత్స కోసం కృష్ణానగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సీటీ స్కాన్, ఎక్స్‌రే సదుపాయాలు లేవు. దాంతో తన నర్సింగ్‌హోంకు తీసుకొచ్చారని ఆయనకు అప్పుడు చికిత్స అందించిన డాక్టర్ బాసుదేవ్ మండల్ తెలిపారు. అప్పట్లో ఆయన మెదడులో రక్తం గడ్డకట్టడాన్ని గుర్తించలేదని.. అదే ఆగస్టులో బయటపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాగా.. ఓవైపు ప్రణబ్‌కు ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందుతున్నప్పటికీ ఆయన మరణించారంటూ ముందుగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజానిజాలు నిర్ధారించుకోకుండా పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా ట్విటర్‌లో షేర్ చేశారు. సంతాపాలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రణబ్ కుమారుడు అభిజిత్ తీవ్రంగా మండిపడ్డారు. తన తండ్రి సజీవంగా ఉన్నారని.. వైద్య చికిత్సకు స్పందిస్తున్నారని కీలక అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని ట్వీట్ చేశారు. కుమార్తె శర్మిష్ట కూడా తన తండ్రికి ఏమీ కాలేదని తెలిపారు. కానీ, ఆయన పరిస్థితి క్రమేణా క్షీణిస్తూ వచ్చి కోమాలోనే కన్నుమూశారు. కాగా, అధికార లాంఛనాలతో, సైనిక గౌరవ వందనంతో సోమవారం ప్రణబ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ప్రణబ్ ముఖర్జీ (1935-2020)
పూర్తి పేరు : ప్రణబ్ కుమార్ ముఖర్జీ
పుట్టిన తేదీ : డిసెంబరు 11, 1935
స్వగ్రామం : మిరాటి, బీర్‌భం జిల్లా, బెంగాల్
తల్లిదండ్రులు : రాజ్‌లక్ష్మి, కమద కింకర్ ముఖర్జీ
విద్యాభ్యాసం : ఎంఏ, ఎల్‌ఎల్‌బీ
తొలి ఉద్యోగం : లెక్చరర్
(రాజనీతి శాస్త్రం) - 1963
రాజ్యసభలో తొలి అడుగు : 1969
దేశ ఆర్థికమంత్రిగా తొలి అవకాశం : 1982
1991 : ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్
1995 : విదేశాంగ మంత్రి
1998 : ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ
2004 : తొలిసారి లోక్‌సభకు.. రక్షణమంత్రి పదవి
2008 : పద్మవిభూషణ్ పురస్కారం
2009 : దేశ ఆర్థికమంత్రిగా రెండోసారి
2012 : 13వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం
2019 : భారతరత్న పురస్కారం
2020 ఆగస్టు 10 : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
2020 ఆగస్టు 13 : మెదడు సర్జరీ తర్వాత కోమాలోకి
2020 ఆగస్టు 31 : 84 ఏళ్ల వయసులో కన్నుమూత
కుటుంబ నేపథ్యం..
పశ్చిమ బెంగాల్లోని బీర్బం జిల్లాలో మిరాటి గ్రామంలో 1935 డిసెంబరు 11న బ్రాహ్మణ కుటుంబంలో ప్రణబ్ జన్మించారు. ఆయన తండ్రి కామదకింకర్ ముఖర్జీ కాంగ్రె్‌సలో అనేక హోదాల్లో పనిచేశారు. ప్రణబ్ కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి చరిత్ర, రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేయడంతో పాటు న్యాయశాస్త్రంలో కూడా పట్టా సాధించారు. కొద్దిరోజులు అప్పర్ డివిజన్ క్లర్కుగా, న్యాయవాదిగా, రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా, జర్నలిస్టుగా కూడా పనిచేశారు. 1965లో సువ్ర ముఖర్జీని పెళ్లి చేసుకున్నారు. ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో ఆయన ఏడుసార్లు పార్లమెంటేరియన్‌గా పనిచేశారు. ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌ల నేతృత్వంలో ఆర్థిక, వాణిజ్య, విదేశాంగ, రక్షణ శాఖల బాధ్యతలను అత్యంత సమర్థంగా నిర్వర్తించారు. రాజకీయ వ్యూహకర్తగా, సంక్షోభ పరిష్కర్తగా తిరుగులేని పేరుతెచ్చుకున్నారు. ప్రణబ్ కెరీర్‌లో చివరి మజిలీ.. రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతిగా ఆయన దేశానికి సమర్థ సేవలందించారు.
సరళీకరణకు పునాదులు
పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయ వర్గాల్లో ప్రణబ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. రాజకీయ దురంధరుడిగా, మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకు సాటి మరెవరూ లేరని రాజకీయ పార్టీలు అంటుంటాయి. అమోఘ జ్ఞాపక శక్తి ఆయన సొంతం. భారత ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దిన అతి కొద్దిమంది నిపుణుల్లో ఆయనా ఒకరు. ఇందిరాగాంధీ హయాంలో 1982-84 నడుమ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. ‘ఆపరేషన్ ఫార్వర్డ్’తో ఆర్థిక సరళీకరణకు పునాదులు వేశారు. పన్ను సంస్కరణలు, దేశంలో పెట్టుడులు పెట్టే ప్రవాస భారతీయులకు ప్రోత్సాహకాలు ప్రకటించడం వంటి చర్యలతో దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఆ సమయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) భారత్‌కు ఇవ్వజూపిన ఆఖరు ఇన్‌స్టాల్‌మెంట్ అప్పు 1.1 బిలియన్ డాలర్లను తీసుకోకుండానే దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపారు. బహుశా ఐఎంఎఫ్ చరిత్రలోనే అలా ఒక దేశం తీసుకోవాల్సిన అప్పు మొత్తం తీసుకోని సందర్భం అదొక్కటే!! దీంతో 1984లో ‘యూరో మనీ’ జర్నల్ ఆయన్ను ప్రపంచంలోని ఐదుగురు అత్యుత్తమ ఆర్థిక మంత్రుల్లో ఒకరుగా గుర్తించింది. ఆసక్తికరమైన విషయమేటంటే.. ప్రణబ్ ఆర్థిక మంత్రిగా సమయంలో మన్మోహన్ సింగ్ ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్నారు. అదే ప్రణబ్‌దా ఆ తర్వాత మన్మోహన్ నేతృత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా ప్రణబ్ ఆర్థిక మంత్రిగా తన సమర్థతను చాటుకున్నారు. దీంతో, 2010లో.. ‘ఎమర్జింగ్ మార్కెట్స్’ పత్రిక ఆయన్ను ఆసియాలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా ప్రకటించింది.

లక్కీ నంబర్ 13
ప్రణబ్ ముఖర్జీ అదృష్ట సంఖ్య 13. దీంతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ప్రణబ్‌కు వివాహమైంది 1957 జూలై 13న. లోక్‌సభకు తొలిసారిగా ఎన్నికైంది 2004 మే 13న. ఆయన అప్పట్లో నివసించింది తల్కతొరా రోడ్డులోని 13వ నంబరు ఇంట్లోనే. యూపీఏ హయాంలో ప్రణబ్‌కు పార్లమెంటు 13వ నంబరు గదిలోనే కార్యాలయం ఉండేది. భారత 13వ రాష్ట్రపతిగా ఆయన ఎన్నిక కావడం విశేషం.
ప్రణబ్ జయంతి రోజున.. ‘ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ పుస్తకావిష్కరణ
దేశ ప్రథమ పౌరుడిగా 2012 నుంచి 2017 దాకా బాధ్యతలు నిర్వర్తించిన ప్రణబ్ ముఖర్జీ.. ఆ అనుభవాలతో రచించిన ‘ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ పుస్తకం ఇంకా విడుదల కాలేదు. డిసెంబరు 11న ప్రణబ్ జయంతి రోజున ఆ పుస్తకాన్ని విడుదల చేయనున్నట్టు దాని ప్రచురణ కర్త రూపా పబ్లికేషన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి భవన్ పనితీరు గురించి, అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన పెట్టడానికి దారితీసిన కారణాలు, నోట్ల రద్దు, సర్జికల్ స్ట్రైక్స్, ప్రధాని మోదీతో, ఎన్డీయే సర్కారుతో ప్రణబ్ సంబంధాలు.. తదితర కీలక అంశాలు ఈ పుస్తకంలో ఉన్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.
మిరాటీ పనసపండ్ల రుచిచూసి..
ప్రణబ్‌కు సొంతూరు మిరాటీపై ఉన్న మమకారానికి నిదర్శనం ఈ ఘటన. చికిత్సకు తీసుకెళ్లడానికి ముందు ఆయన తన కుమారుడిని పిలిపించి.. మిరాటీ నుంచి కొన్ని పనసపండ్లు తీసుకురమ్మన్నారు. దీంతో మిరాటీ నుంచి ఆగస్టు 3న అభిజిత్ తెచ్చిన పనసపండ్లను ప్రణబ్ రుచిచూశారు. ఆయనకు ఇష్టమైన ఫలాల్లో పనసపండు ఒకటని ఆయన సన్నిహితులు అంటారు.
పన్ను సంస్కరణలకు శ్రీకారం
ప్రణబ్ ముఖర్జీ కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో పలు సంస్కరణలు చేపట్టారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి (1982 జనవరి నుంచి 1984 డిసెంబరు వరకు), మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మరోసారి (2009 జనవరి నుంచి 2012 జూన్ వరకు) ప్రణబ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. మొదటిసారి ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో దేశంలో పన్ను సంస్కరణలకు ప్రణబ్ శ్రీకారం చుట్టారు. రెండోసారి ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ప్రత్యక్ష పన్ను చట్టంలో పూర్వపు కాలం నుంచి పన్నులు అమల్లోకి వచ్చే విధానాన్ని తీసుకువచ్చారు. ప్రణబ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో మంచి వృద్ధి రేటు నమోదైనా.. 2012లో ఆయన ఆర్థిక మంత్రి పదవి నుంచి తప్పుకునే సమయంలో నెలకొన్న పరిస్థితుల మూలంగా ఆయన విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ప్రణబ్ ముఖర్జీ ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిం చారు. ఆయన అనుభవం, మేధాశక్తి, సలహాలు లేని కాంగ్రెస్ పార్టీని ఊహించుకోవడం కష్టం. వ్యక్తిగతంగా కూడా ప్రణబ్ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను.
- కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ
2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పుడు నాకు ఢిల్లీలో అంతా కొత్త. అలాంటి సమయంలో మొదటి రోజు నుంచీ నాకు ప్రణబ్ ముఖర్జీ మార్గదర్శకత్వం, అండ, ఆశీస్సులు లభించడం అదృష్టం. ప్రణబ్ ముఖర్జీ మృతితో యావద్దేశం విషాదంలో మునిగిపోయింది. దేశ అభివృద్ధి పథం లో ప్రణబ్ చెరగని ముద్ర వేశారు.
- ప్రధాని మోదీ
