మాజీ ఎంఈఏ అధికారి ఇంట్లో దోపిడీ... దంపతుల్లో ఒకరి హత్య...

ABN , First Publish Date - 2020-06-21T22:21:35+05:30 IST

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో దారుణం జరిగింది.

మాజీ ఎంఈఏ అధికారి ఇంట్లో దోపిడీ... దంపతుల్లో ఒకరి హత్య...

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లో దారుణం జరిగింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) మాజీ అధికారి బీఆర్ చావ్లా నివాసంలో దొంగతనం జరిగింది. దొంగలు ఆయనను గాయపరచి, ఆయన సతీమణిని హత్య చేశారు. 


ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీఆర్ చావ్లా వయసు 94 సంవత్సరాలు, ఆయన సతీమణి కాంతా చావ్లా వయసు 88 ఏళ్ళు. 


చావ్లా దంపతులు నివసిస్తున్న బిల్డింగ్ సెక్యూరిటీ గార్డు, మరొక ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ దారుణానికి పాల్పడినట్లు ఢిల్లీ నైరుతి విభాగం డీసీపీ దేవేందర్ ఆర్య చెప్పారు.


సెక్యూరిటీ గార్డు, అతనితోపాటు వచ్చినవారు దొంగతనం చేయబోగా కాంతా చావ్లా వారించేందుకు ప్రయత్నించడంతో, దుండగుల్లో ఒకరు ఆమెను కత్తితో పొడిచినట్లు తెలిపారు. అంతకుముందు బీఆర్ చావ్లాను సెక్యూరిటీ గార్డు ఓ సోఫాలోకి తోసేసినట్లు తెలిపారు. 


ఈ దాడి అనంతరం నిందితులు పడక గదిలోకి వెళ్ళి, బంగారు ఆభరణాలు, నగదు తీసుకుని వెళ్లిపోయినట్లు చెప్పారు. 


కాంతా చావ్లా తీవ్ర గాయాలతో పడిపోగా, బీఆర్ చావ్లా బయటకు వెళ్ళి, సహాయం కోసం అర్థించారని చెప్పారు. 


ఇరుగుపొరుగువారు సహాయపడి, కాంతా చావ్లాను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. ఆమె ప్రాణాలు కోల్పోయారన్నారు. 


చావ్లా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండేవారని, ఇద్దరూ కొన్నేళ్ళ క్రితం మరణించారని పోలీసులు తెలిపారు. 


Updated Date - 2020-06-21T22:21:35+05:30 IST