ఇస్రో గూఢచర్యం కేసులో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు నష్టపరిహారం చెల్లింపు
ABN , First Publish Date - 2020-08-12T00:37:40+05:30 IST
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు

తిరువనంతపురం : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు కేరళ ప్రభుత్వం నష్టిపరిహారం చెల్లించింది. ఆయనకు రూ.1.30 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని గత ఏడాది రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసింది. నారాయణన్‌ను 1994లో తప్పుడు గూఢచర్యం కేసులో ఇరికించిన సంగతి తెలిసిందే.
భారత దేశపు క్రయోజనిక్ ఇంజిన్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని రష్యా, పాకిస్థాన్‌లకు అమ్మినట్లు ఆరోపిస్తూ నంబి నారాయణన్‌తోపాటు మరొక శాస్త్రవేత్తపై 1994లో కేసు పెట్టారు. ఈ కేసులో ఆయనను అనవసరంగా అరెస్టు చేసి, వేధించారని, మానసిక వేదనకు గురి చేశారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తుకు ఆదేశించింది.
కేరళ ప్రభుత్వం ప్రస్తుతం చెల్లించిన రూ.1.30 కోట్లు గతంలో చెల్లించిన పరిహారానికి అదనం. గతంలో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రూ.50 లక్షలు, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు రూ.10 లక్షలు చెల్లించింది.
తనను అరెస్టు చేసినందుకు నష్టపరిహారం చెల్లించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వంపై నంబి నారాయణన్ తిరువనంతపురం సబ్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ప్రభుత్వం నారాయణన్‌తో రాజీ కుదుర్చుకుంది. అనంతరం ఆయన కేసును ఉపసంహరించుకున్నారు.