కమల్‌హాసన్ పార్టీలో మాజీ ఐఏఎస్..

ABN , First Publish Date - 2020-12-01T20:41:45+05:30 IST

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల్లో కొత్త చేరికలు వచ్చి ..

కమల్‌హాసన్ పార్టీలో మాజీ ఐఏఎస్..

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీల్లో కొత్త చేరికలు వచ్చి చేరుతున్నాయి. నటుడు కమల్‌హాసన్  స్థాపించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం)లో మాజీ ఐఏఎస్ సంతోష్ బాబు మంగళవారంనాడు చేరారు. ఆయనకు కమల్‌హాసన్ పార్టీ సభ్యుత్వాన్ని అందజేశారు. అనంతరం ఎంఎన్ఎం ప్రధాన కార్యదర్శిగా సంతోష్ బాబును నియమించారు.


ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ, సంతోష్ బాబు డాక్టర్ అని, ఐఏఎస్ అధికారిగా 25 ఏళ్ల పాటు ప్రభుత్వ యంత్రాంగంలో పనిచేశారని, రాష్ట్ర ప్రజలకు సేవలందించేందుకు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారని చెప్పారు. ఎనిమిది సంవత్సరాలు ముందుగానే ఆయన పదవిని వీడారని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది మంచి వ్యక్తులను పార్టీలోకి ఆయన తీసుకు వస్తారని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యాలయ నిర్వహణ బాధ్యతలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టో రూపకల్పన బాధ్యతలు కూడా సంతోష్ బాబు చూసుకుంటారని అన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న 'నివర్' తుపాను ‌సహాయక చర్యలపై అడిగినప్పుడు, ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి పనితీరుపై తమ పార్టీ సంతృప్తిగా లేదని కమల్‌హాసన్ సమాధానమిచ్చారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. రైతు సమస్యలేమిటో కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలని కమల్‌హాసన్ సూచించారు. కాగా, 2018 ఫిబ్రవరి 21న  'మక్కల్ నీది మయ్యం' పార్టీని కమల్‌హాసన్ స్థాపించారు. 2021లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎంఎన్ఎం సమాయత్తమవుతోంది.

Updated Date - 2020-12-01T20:41:45+05:30 IST