ఎంజీఆర్ ఎవరికి సొంతం?
ABN , First Publish Date - 2020-12-31T13:13:08+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ మృతిచెంది మూడు దశాబ్దాలు దాటినా ఆయన స్థాపించిన పార్టీతో పాటు ఇతర పార్టీలూ ఆయన నామస్మరణ ....
ఇప్పటికీ ఆయన పేరుతో పార్టీల ప్రచారం
ఆయన పాలన తెస్తామంటూ హామీలు
చెన్నై(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ మృతిచెంది మూడు దశాబ్దాలు దాటినా ఆయన స్థాపించిన పార్టీతో పాటు ఇతర పార్టీలూ ఆయన నామస్మరణ చేస్తున్నాయి. ఆయన ఆశయాలకు పాటుపడతామంటూ కొన్ని పార్టీలు చెబుతుంటే, ఆయన పాలన అందిస్తామని మరికొన్ని పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. ఆయన పాలన కొనసాగిస్తున్నామని అన్నాడీఎంకే చెబుతుంటే, ఆయన హయాం మళ్లీ తెస్తామని, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటా మంటూ ఇంకో పార్టీ బల్లగుద్ది మరీ గొంతెత్తుతోంది. ఇంతకీ ఎంజీఆర్ ఎవరికి సొంతం? ఆయన అన్నాడీఎంకే స్థాపకుడైనా ఇతర పార్టీలు ఆయన నామస్మరణ చేయడంలోని మతలబేంటి? ఆయన్ని సొంతం చేసుకునేందుకు పార్టీలు పడుతున్న పాట్లలో పరమార్థమేంటి? ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ గతంలో ఎన్నడూ లేనంతగా ఎంజీఆర్ పేరును అన్ని పార్టీలు ఎందుకు ఉచ్ఛరిస్తున్నాయి?.. ఇవీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో రేకెత్తుతున్న సందేహాలు..
నాటకాలతో నటనాజీవితం ప్రారంభించిన ఎంజీఆర్.. చలనచిత్ర రంగంలో ప్రవేశించి వెండితెర వేల్పుగా కోట్లాదిమంది ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించికున్నారు. అన్నాదురై, కరుణానిధి తదితర నేతలతో సన్నిహితంగా వుంటూ, డీఎంకే ఆవిర్భావంలో పాలుపంచుకున్నారు. సాధారణ సభ్యుడిగా ఉంటూ, ఆ పార్టీ ఓటు బ్యాంకు పెరిగేందుకు కృషిచేశారు. 1957లో డీఎంకే 15 శాతం ఓట్లు పొందేందుకు ఎంజీఆర్ చేసిన కృషిని ఆ పార్టీ మరిచిపోలేదు. 1964లో డీఎంకేకు దక్కిన ఒకే ఒక్క ఎంఎల్‌సీ పదవికి రాజీనామా చేసి ‘కామ రాజర్ నా గురువు, అన్నా నాకు స్ఫూర్తి’ అంటూ బహిరంగంగానే ప్రకటించా రు. 1976లో ముఖ్యమంత్రి అభ్యర్థ్ధిని ప్రకటించకపోయినా, నమ్మిన సిద్ధాంతా నికి కట్టుబడి డీఎంకే విజయానికి, ఆ పార్టీకి 40 శాతం ఓట్లు పెరిగేందుకు ఎంతో దోహదపడ్డారు. ఆ మంత్రివర్గంలో స్థానం దక్కకపోయినా, మంత్రి పదవికి సమానంగా ఉన్న రాష్ట్ర చిన్నమొత్తాల పొదుపు ఉపాధ్యక్ష పదవిని ఇచ్చినా ఎంజీఆర్ కిమ్మనలేదు. 1969లో అన్నా మృతి చెందిన అనంతరం ముఖ్యమంత్రి కరుణానిధికి అండగా నిలిచారు. డీఎంకే కోశాధికారిగా, పార్టీలో నంబర్ 2గా కొనసాగారు. 1972లో కరుణానిధితో ఏర్పడిన విభేదాలతో, డీఎంకే నుంచి బహిష్కరణకు గురై అన్నాడీఎంకేను స్థాపించారు. తమిళనాడు కంటే ముందుగా ఆ పార్టీ పుదుచ్చేరిలో అధికారం చేపట్టింది. 1977 అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ వున్నా, ధీటైన నేతగా ఎదిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1980 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే కూటమి ఘనవిజయం సాధించడం, ఆ సమయంలో ఎంజీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేయడంతో, అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే కూటమి 38.8 శాతం ఓట్లు పొందినా పరాజయం పాలైంది. దాంతో ఎంజీఆర్ మళ్లీ సీఎం అయ్యారు. ఆర్థికంగా వెనుకబడిన గిరిజనులు, బీసీలకు కల్పించిన 31 శాతం రిజర్వేషన్‌ను 50 శాతంకు పెంచి, అన్ని వర్గాలకు అండగా నిలిచిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. 1983లో తిరుచెందూర్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో జనరల్ విభాగంగా ఉన్న క్రైస్తవ నాడార్లను బీసీల్లో చేర్చేలా ఎంజీఆర్ చేపట్టిన రాజకీయచతురతతో తూత్తుకుడి, తిరునల్వేలి, కన్నియాకుమారి తదితర దక్షిణ జిల్లాల్లో అన్నాడీఎంకేకు ఓటు బ్యాంకుపెరిగింది. పార్టీ సీనియర్ నేత ఎస్డీ సోమ సుందరం సూచనలతో, గ్రామ మునసబు వ్యవస్థను రద్దుచేశారు. ఆ స్థానంలో గ్రామ నిర్వాహకాధికారులుగా 10 వేల మంది యువకులకు అవకాశం కల్పించారు. ఇందులో 2 వేల మంది దళితులుండడం విశేషం. ఉచిత మధ్యాహ్న భోజనం పథకం, పౌష్ఠికాహార పథకం, పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాలపొడి, పాదరక్షలు అందించడం, సైకిల్‌పై ఇద్దరు వెళ్లేందుకు అను మతించడం తదితరాలు పేదల కోసం సంక్షేమం కోసం ఎంజీఆర్ చేపట్టిన బృహత్తర పథకాలతో ఆయన ప్రజల గుండెల్లో దేవుడై నిలిచారు.
విజయకాంత్‌కు కలిసొచ్చిన ‘నల్ల ఎంజీఆర్’ గుర్తింపు
ఎంజీఆర్ నటనా వారసుడిగా పేరొందిన నటుడు భాగ్యరాజ్, ఎంజీఆర్‌ను వ్యతిరేకించే టి.రాజేందర్ కూడా ఆయన పేరును వినియోగించుకున్నా ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ, ఎంజీఆర్ లాగే నటన, గంభీరం కలిగిన నటుడు విజయకాంత్ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ‘నల్ల ఎంజీఆర్’గా ముందుకొచ్చారు. వ్యక్తిగత చరిష్మాతో పాటు ‘కరుప్పు కంజీఆర్’ అన్న గుర్తింపు కూడా ఆయనకు లబ్ధి చేకూర్చిపెట్టిందని ఆ తరువాత వెల్లడైన ఓట్ల గణాంకాలు స్పష్టం చేశాయి. అన్నాడీఎంకే కోటగా ఉన్న కొంగు మండలం, మదురై పరిసర ప్రాంతాలు, దక్షిణ తమిళనాడు ప్రాంత ప్రజలు అన్నాడీఎంకేను కాదని విజయకాంత్‌ను ఆదరించాయి. 2006 నుంచి 2011 వరకు జరిగిన ఉప ఎన్నికల్లోను విజయకాంత్ ‘నల్ల ఎంజీఆర్’ నానుడి అన్నాడీఎంకేకు పెను సవాలుగా నిలిచింది. విజయకాంత్‌కున్న ‘నల్ల ఎంజీఆర్ పేరుకు చెక్ పెట్టేలా, ఒకే ఎంజీఆర్ అని, నల్ల ఎంజీఆర్ ఎవరూ లేరని జయ ఎదురు దాడిచేశారు. కానీ అనంతరం జరిగిన పరిణామాల్లో ఎంజీఆర్ శక్తులను ఏకం చేస్తామంటూ ఆ రెండు పార్టీలు కలిసి నడవాల్సి వచ్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-డీఎండీకే కూటమి ఏర్పడిన తర్వాతనే నల్ల ఎంజీఆర్‌గా గుర్తింపు బలహీనపడిపోయింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంజీఆర్ పేరే ప్రధాన ప్రచారం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంజీఆర్ పేరుతో లబ్ధ్ది పొందాలని పలు రాజకీయ పార్టీలు ప్రయ త్నిస్తున్నాయి. 2017లో కళాశాలలో జరిగిన కార్యక్రమంలో రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన నటుడు రజనీకాంత్ ‘ఎంజీఆర్ ఒక అవతార పురుషుడు. ఆయనలా ఉండలేం... కానీ ఆయన పాలన అందిస్తామని’ పేర్కొన్నారు. తాజాగా, ఎన్నికల ప్రచారం చేపట్టిన నటుడు కమల్‌హాసన్ కూడా తానూ ఎంజీఆర్ వారసుడినే ప్రచారం చేసుకుంటున్నారు. ‘వేల్’ యాత్ర చేపట్టిన బీజేపీ కూడా ప్రచారంలో ఎంజీఆర్ ఫొటోను వినియోగించుకుంది. వేల్ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ‘ఎంజీఆర్ పాలనను బీజేపీ అందిస్తుంది’ అంటూ ప్రకటించారు. డీఎంకే, కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు ఎంజీఆర్ పేరును స్మరిస్తున్నాయి. ఇక ప్రస్తుత అధికార అన్నాడీఎంకే అయితే తమది ఎంజీఆర్ పాలన అని, ఇది కొనసాగేలా ప్రజలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పర్టీకే ఓటేయాలని అభ్యర్థిస్తోంది.
ఎంజీఆర్ పేరుతో తొలి ప్రచారం కరుణదే
తన ప్రత్యర్థి అయినప్పటికీ ఎంజీఆర్ పేరుతో ప్రచారం చేసిన తొలి నేత డీఎంకే అధినేత కరుణానిథి. 1984 ఎన్నికల ప్రచారం సమయంలో ’నా స్నేహితుడు ఎంజీఆర్, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని అప్పగిస్తాను. అందువల్ల నాకే ఓటు వేయండి’ అంటూ ఆయన ప్రజలకు బహిరంగ పిలుపునిచ్చారు. అయినా ఎంజీఆర్ ఓటు బ్యాంకును మాత్రం చీల్చలేక పోయారు. ఆ సమయంలో అనారోగ్యంతో అమెరికాలో చికిత్స పొందుతూ ప్రచారంలో పాల్గొనలేక పోయినా ఎంజీఆర్ అధిక స్థానాలు సాధించి, ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు ఎంజీఆర్. మొత్తం మూడు సార్లు వరుసగా ముఖ్యమంత్రిగా వ్యవహరించి 1987 డిసెంబరు 24న మృతిచెందారు.
ఆది నుంచీ ఆయన పేరే
ఎంజీఆర్ మరణానంతరం జరిగిన వారసత్వ పోటీలో అన్నాడీఎంకే అధికారిక చిహ్నమైన ‘రెండాకులు’ మరుగునపడిపోయింది. ఆ ఎన్నికల్లో ఎంజీఆర్ వారసురాలిగా గళం విప్పిన జయలలిత కోడిపుంజు చిహ్నంతో పోటీచేసి 22.3 శాతం, ఎంజీఆర్ సతీమణి వీఎన్ జానకి 9.1 శాతం ఓట్లు పొందారు. అనంతరం జయకు మద్దతు తెలిపిన జానకి.. రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 1991 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ‘రెండాకులు’ చిహ్నం సాధించుకున్న జయ.. ఎంజీఆర్ వారసురాలిగా గుర్తింపు పొందారు. అయినా, 1991 ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థులుగా శ్రీవిల్లిపుత్తూర్ నియోజక వర్గంలో తామరైక్కని, సాత్తూర్‌లో కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్, అరంతాంగిలో తిరునావుక్కరసర్‌లు పోటీ చేసి ఎంజీఆర్ పేరుతో ప్రచారం చేసుకున్నారు. వారు విజయం సాధించినప్పటికీ ఎంజీఆర్ వారసురాలిగా జయకే గుర్తింపు దక్కింది. ఆ తరువాత ఆ ముగ్గురూ జయను సమర్థించారు. అనంతరం అన్నాడీఎంకేతో విభేదాలు ఏర్పడి సీనియర్ నేతలు ఎస్డీ సోమసుందరం, ఆర్‌ఎం వీరప్పన్, తిరునావుక్కరసర్, ఎస్.ముత్తుస్వామి సహా పలువురు వివిధ పార్టీలు ప్రారంభించినా, పెద్దగా రాణించలేకపోయారు.