2014 నాటి కేసులో ఆప్ మాజీ ఎమ్మెల్యేకు ఊరట
ABN , First Publish Date - 2020-12-29T19:29:56+05:30 IST
ఓ మహిళపై దాడి కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ ఎమ్మెల్యే
న్యూఢిల్లీ : ఓ మహిళపై దాడి కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ ఎమ్మెల్యే మనోజ్ కుమార్‌కు ఢిల్లీ సెషన్ కోర్టులో ఉపశమనం లభించింది. ఈ కేసులో ఆయన నిర్దోషి అని తీర్పు వెలువడింది. ఆయన ఓ మహిళపై దాడి చేసినట్లు ఐపీసీ సెక్షన్ 352 ప్రకారం 2014లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
మనోజ్ కుమార్ దోషి అని 2019 ఆగస్టు 13న మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు చెప్పింది. ఆయనకు ఏడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. ఆయన ప్రజా ప్రతినిధి అని, తన వద్దకు వచ్చినవారి సమస్యలను ఓపిగ్గా విని, మర్యాదపూర్వకంగా ప్రవర్తించవలసిన కర్తవ్యం ఆయనకు ఉందని తెలిపింది. దీనిపై ఆయన చేసిన అపీలుపై అదనపు సెషన్ జడ్జి గీతాంజలి గోయల్ విచారణ జరిపారు. మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును రద్దు చేస్తూ, మనోజ్ కుమార్ నిర్దోషి అని ప్రకటించారు.
ఫిర్యాదుదారు కథనం ప్రకారం, మనోజ్ కుమార్ ఎమ్మెల్యేగా పని చేసిన 2014లో ఆయన వద్దకు ఆయన నియోజకవర్గం పరిథిలోని ఓ ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు వెళ్లారు. తమ ప్రాంతంలో నీరు నిలిచిపోతోందని, ప్రజలకు తీవ్ర సమస్యగా మారిందని చెప్పేందుకు వీరంతా వెళ్ళారు. కానీ వారి గోడు వినేందుకు ఆయన నిరాకరించి, ఫిర్యాదుదారును తోసేసి, వారందరినీ బయటికి పంపించేయాలని తన సెక్యూరిటీ సిబ్బందికి ఆయన చెప్పారు.