ఉన్నట్టుండి ఆటోలో తిరిగిన విదేశీయులు.. భీతిల్లిన ప్రజలు

ABN , First Publish Date - 2020-03-27T14:47:01+05:30 IST

ఆటోలో ఫ్రాన్స్‌కు చెందిన దంపతులు సంచరిచడం స్థానికులలో భయాందోళనలు కలిగించింది.

ఉన్నట్టుండి ఆటోలో తిరిగిన విదేశీయులు.. భీతిల్లిన ప్రజలు

చెన్నై : దిండుగల్‌ జిల్లా ఒట్టన్‌ సత్తిరం వద్ద ఆటోలో ఫ్రాన్స్‌కు చెందిన దంపతులు సంచరిచడం స్థానికులలో భయాందోళనలు కలిగించింది. కరోనా నిరోధక చర్యలలో భాగంగా అక్కడి ప్రజలంతా గృహనిర్బంధం పాటిస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఓ ఆటోలో ఫ్రాన్స్‌కు చెందిన దంపతులు రావడం, ఆ ఆటో మరమ్మతుకు గురై ఇద్దరూ రోడ్డు పక్కనే నిలబడడం చూసి స్థానికులు భయపడ్డారు. వెంటనే ఫ్రాన్స్‌ దంపతుల గురించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు .పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని విచారించారు.. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన ఆ దంపతులు కొడైకెనాల్‌కు విహార యాత్రగా వచ్చారని, తిరిగి వెళ్లేందుకు బస్సులు, టాక్సీ సదుపాయం లేకపోవడంతో ఓ ఆటోను కొనుక్కుని వారు చెన్నై బయలుదేరారని పోలీసుల విచారణలో తెలిసింది. 


ఆటోలో వారిద్దరూ చెన్నై వెళ్తుండగా మార్గమధ్యలో  ఇంజన్‌ చెడిపోయింది. దీంతో ఒట్టన్‌సత్తిరం వద్ద ఆటోను నిలిపి మరమ్మతు చేస్తుండగా ఫ్రాన్‌ దంపతులను చూసి స్థానికులు భీతిల్లారు. పోలీసులు వారిద్దరికీ కరోనా  పరీక్షలు చేసుకోవాలని చెప్పగా తాము ఇదివరకే ఆరుసార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నామని, కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ అయిందని పోలీసులకు వారు తెలిపారు. ఆ తర్వాత పోలీసులు మరొక ఆటోను అద్దెకు ఏర్పాటు చేసి వారి స్వంత ఆటోను దాని వెనుక కట్టి దంపతులను అక్కడి నుండి పంపివేశారు.

Updated Date - 2020-03-27T14:47:01+05:30 IST