కోవిడ్-19 వ్యాప్తిపై అభిప్రాయాలు పంచుకున్న భారత్, అమెరికా

ABN , First Publish Date - 2020-04-09T03:26:26+05:30 IST

మహమ్మారి వ్యాప్తి, దానికి సంబంధించిన ఇతర సవాళ్ళపై భారత్, అమెరికా అభిప్రాయాలు

కోవిడ్-19 వ్యాప్తిపై అభిప్రాయాలు పంచుకున్న భారత్, అమెరికా

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి, దానికి సంబంధించిన ఇతర సవాళ్ళపై భారత్, అమెరికా అభిప్రాయాలు పంచుకున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బుధవారం భారత దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి శృంగ్ల, అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ స్టీఫెన్ ఈ బీగెన్ టెలిఫోన్‌ ద్వారా సంభాషించారు. 


కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనడంతోపాటు దానిని నియంత్రించేందుకు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికిగల మార్గాలను వీరిరువురు చర్చించినట్లు సమాచారం. కొత్త చికిత్సల అభివృద్ధి వంటివాటి ద్వారా ఈ మహమ్మారిని ఎదుర్కొనాలని వీరు అభిప్రాయం వ్యక్తం చేశారు. 


అత్యవసర మందులు, రోగ నిర్థరణ, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచడం; అత్యుత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడం, సమాచారాన్ని ఇచ్చి, పుచ్చుకోవడం వంటివి జరగాలని వీరు అభిప్రాయపడ్డారు. 


ఈ నెల 4న భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలిఫోన్ ద్వారా సంభాషించిన సంగతి తెలిసిందే. ఈ నెల 6న భారత దేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపియో కూడా చర్చలు జరిపారు. 


Updated Date - 2020-04-09T03:26:26+05:30 IST