‘ఆరోగ్యం, ఉపాధి వృద్ధితో ‘నవ కశ్మీర్’ నిర్మాణంపై దృష్టి’

ABN , First Publish Date - 2020-08-01T22:01:16+05:30 IST

నూతన కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీరు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించేందుకు

‘ఆరోగ్యం, ఉపాధి వృద్ధితో ‘నవ కశ్మీర్’ నిర్మాణంపై దృష్టి’

శ్రీనగర్ : నూతన కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ-కశ్మీరు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్యం, సులువైన పరిపాలన, ప్రజాస్వామిక వికేంద్రీకరణలపై దృష్టి సారించి, నవ కశ్మీరు నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. జమ్మూ-కశ్మీరు ప్రభుత్వ అధికారులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం, అధికరణ 370 రద్దుతో ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయి, కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడినప్పటి నుంచి ‘నవ కశ్మీరు’ నినాదంతో అభివృద్ధికి కృషి జరుగుతోంది. 


అధికరణ 370ని గత ఏడాది ఆగస్టు 5న రద్దు చేశారు. జమ్మూ-కశ్మీరు, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు గత ఏడాది అక్టోబరు 31 నుంచి ఉనికిలోకి వచ్చాయి. 


నవ కశ్మీరు నినాదంతో సాంఘికాభివృద్ధి, ఆర్థిక పునరుజ్జీవం, స్వచ్ఛ భారత్, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన వంటి రంగాలపై దృష్టి సారించామని జమ్మూ-కశ్మీరు ప్రభుత్వాధికారులు తెలిపారు. 


వివక్షాపూరితమైన కొన్ని చట్టాలను రద్దు చేయడం కానీ, సవరించడం కానీ చేసినట్లు తెలిపారు. 170 కేంద్ర చట్టాలను అమల్లోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీల పరిరక్షణ, అటవీ నివాసుల పరిరక్షణ, బాలలు, వయోవృద్ధుల సంక్షేమం వంటి చట్టాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 


దేశంలోని మిగిలిన రాష్ట్రాల ప్రజలతో సమానంగా జమ్మూ-కశ్మీరు ప్రజలు తమ హక్కులను అనుభవించే అవకాశం లభించిందన్నారు. భూ సేకరణ జరిగినట్లయితే, న్యాయమైన నష్టపరిహారం పొందే హక్కు లభించినట్లు తెలిపారు. 


డొమిసిల్ చట్టాన్ని అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం యువతకు కలిగిందన్నారు. పశ్చిమ పాకిస్థానీలు, గూర్ఖాలు, పారిశుద్ధ్య కార్మికులు, జమ్మూ-కశ్మీరుకు చెందనివారిని వివాహం చేసుకున్న మహిళలకు ప్రభుత్వోద్యోగాలు పొందే అవకాశం లభించిందన్నారు. 


పరిశ్రమల ఏర్పాటుకు 6,000 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి, 37 పారిశ్రామిక వాడల నిర్మాణానికి అప్పగించినట్లు తెలిపారు. 


Updated Date - 2020-08-01T22:01:16+05:30 IST