కేసులు పెరుగుతున్నప్రాంతాలపై దృష్టి

ABN , First Publish Date - 2020-11-26T06:54:10+05:30 IST

పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. బాధితులు పెరగడం, పండుగల సీజన్‌, చలి కాలం నేపథ్యంలో కరోనా కట్టడి వ్యూహాన్ని అనుసరించాలని పేర్కొంది. డిసెంబరు 1వ తేదీ నుంచి 31 వరకు పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ బుధవారం

కేసులు పెరుగుతున్నప్రాంతాలపై దృష్టి

కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల

డిసెంబరు 1 నుంచి 31వ తేదీ వరకు అమలు


న్యూఢిల్లీ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. బాధితులు పెరగడం, పండుగల సీజన్‌, చలి కాలం నేపథ్యంలో కరోనా కట్టడి వ్యూహాన్ని అనుసరించాలని పేర్కొంది. డిసెంబరు 1వ తేదీ నుంచి 31 వరకు పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ బుధవారం విడుదల చేసింది.  


  • కట్టడి ప్రాంతాల్లో నిబంధనల అమలు బాధ్యత జిల్లా, పోలీసు యంత్రాంగానిదే. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌లు చేయాలి.
  • రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు పరిస్థితిని బట్టి స్థానికంగా రాత్రి కర్ఫ్యూను అమలు చేయొచ్చు. కట్టడి ప్రాంతాల్లో అత్యవసర కార్యకలాపాలకు అనుమతి. కట్టడి ప్రాంతాల వెలుపల లాక్‌డౌన్‌ విధించాలంటే మాత్రం కేంద్రం అనుమతి తప్పనిసరి. 
  • రాష్ట్రం లోపల, అంతర్‌ రాష్ట్ర కదలికలపై ఆంక్షలు లేవు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో.. అత్యవసర పరిస్థితుల్లో మినహా మిగతా సందర్భాల్లో నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడాలి.
  • కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై మరింత చైతన్యం చేయాలి. జిల్లా/మునిసిపల్‌ అధికారులు, పోలీసులు పర్యవేక్షించాలి. మాస్క్‌లు ధరించకుంటే తగిన జరిమానా విధించే అవకాశాన్ని పరిశీలించాలి. 
  • నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పరీక్షలు కొనసాగించాలి. పాజిటివ్‌ వచ్చినవారి కాంటాక్ట్‌ల ట్రేసింగ్‌ను కొనసాగించాలి. 
  • రద్దీ ప్రదేశాల్లో ముఖ్యంగా వారాంత సంతలతోపాటు ప్రజారవాణా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించడానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడిగా సూచనలు జారీ చేస్తుంది.
  • నిఘా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. ఆ బృందాలు ఇంటింటికీ వెళ్లి, కరోనా పరిస్థితులను పర్యవేక్షించాలి. 
  • కట్టడి ప్రాంతాల వెలుపల అన్ని కార్యకలాపాలకూ ఆమోదం ఉంది. అయితే, అంతర్జాతీయ ప్రయాణాలు, ఈత కొలనులు, ఎగ్జిబిషన్‌ హాళ్లపై ఆంక్షలు కొనసాగుతాయి. ఈత కొలనుల్లో క్రీడాకారులకు మాత్రమే అనుమతి. 
  • సామూహిక కార్యక్రమాలకు గరిష్ఠ హాజరు పరిమితి 200కు లోబడి ఉండాలి. 
  • ప్రభుత్వ కార్యాలయాల్లో భౌతిక దూరం నిబంధనలు అమలు చేయాలి. వారం వారం పాటిజివ్‌ కేసులు 10 శాతానికి మించితే ఆయా నగరాల్లో కార్యాలయాల సమయాలను వేర్వేరు వేళలకు మార్చుకోవాలి. హాజరయ్యే ఉద్యోగుల సంఖ్య కనీస స్థాయిలో ఉండేలా చూసుకోవాలి.

Updated Date - 2020-11-26T06:54:10+05:30 IST