అసోంలో వరద బీభత్సం..కూలిన వంతెన

ABN , First Publish Date - 2020-06-26T17:10:02+05:30 IST

ఈశాన్య రాష్ట్రం అసోంలో కురిసిన భారీ వర్షాలకు నదులు ఉగ్రరూపం దాల్చాయి.

అసోంలో వరద బీభత్సం..కూలిన వంతెన

గువాహటి (అసోం): ఈశాన్య రాష్ట్రం అసోంలో కురిసిన భారీ వర్షాలకు నదులు ఉగ్రరూపం దాల్చాయి. రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. టిన్ సుకియాలోని ధం ధం ప్రాంతాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. టిన్ సుకియా, దిబ్రూఘడ్‌లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లకు వరద నీరు చేరుకుంది. టిన్ సుకియా పరిసరాల్లోని వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో వేలాదిమంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. రోడ్లపై మోకాలి లోతువరకు నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.


అసోంలో భారీ వర్షాలకు ఓ వంతెన కుప్పకూలిపోయింది. దూమ్ దుమా, భాగ్ జాన్ రోడ్డు మధ్యలో ఉన్న వంతెన వరద ఉధృతికి ఉన్నఫలంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ఆ సమయంలో వంతెనపై ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. దిబ్రూఘడ్, టిన్ సుకియా, ధం ధం ప్రాంతాల్లో వరదలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికార యంత్రాంగం బాధితులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తోంది. వారికి అన్నాపానీయాలు అందించేందుకు, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రిస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి.

Updated Date - 2020-06-26T17:10:02+05:30 IST