సైబర్ దాడికి పాల్పడ్డ ఐదుగురు చైనీయులు అమెరికాలో అరెస్ట్
ABN , First Publish Date - 2020-09-18T08:34:42+05:30 IST
అనేక ప్రైవేటు కంపెనీల వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన ఐదుగురు వ్యక్తులను అమెరికా ప్రభు త్వం అరెస్ట్ చేసింది...

- సైబర్ క్రిమినల్స్‌కు చైనా నెలవు: అమెరికా
వాషింగ్టన్, సెప్టెంబరు 17: నిరుడు భారత ప్రభు త్వ వెబ్‌సైట్లను, ప్రభుత్వ పనిని కాంట్రాక్ట్ తీసుకున్న అనేక ప్రైవేటు కంపెనీల వెబ్‌సైట్లను హ్యాక్ చేసిన ఐదుగురు వ్యక్తులను అమెరికా ప్రభు త్వం అరెస్ట్ చేసింది. వీరంతా చైనీయులే. 100 కంపెనీలు, సంస్థల నెట్‌వర్క్‌ను హ్యాక్ చేసి అత్యంత విలువైన సాఫ్ట్‌వేర్ డేటాను, వ్యాపారానికి సంబంధించిన కీలక సమాచారాన్ని దొంగిలించిన నేరంపై అమెరికా ప్రభు త్వం ఈ ఐదుగురిపై అభియోగాలు మోపింది. ఈ కంపెనీలన్నీ అమెరికాలోనివే కావు. భారత్‌తో సహా కొన్ని విదేశాల్లో ఉన్నవి కూడా! వీరికి సహకరించిన మరో ఇద్దరు మలేషియా వాసులనూ అరెస్ట్ చేశారు. ‘‘భారత ప్రైవేటు కంపెనీల వర్చువల్ నెట్‌వర్క్‌ను, సర్వర్లను వీరంతా హ్యాక్ చేశారు. కోబాల్ట్ స్ట్రైక్ అనే మాల్‌వేర్‌ను ప్రయోగించారు. తద్వారా భారత సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి చేరవేశారు’’ అని అమెరికా న్యాయశాఖ అభియోగపత్రంలో పేర్కొంది. ఆస్ట్రేలియా, బ్రిటన్, వియత్నాం, చిలీ, పాకిస్థాన్, బ్రెజిల్, ఇండొనీషియా, హాంకాంగ్, మలేషియా, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, థాయ్‌లాండ్...తదితర దేశాల్లోని కంపెనీలపైనా వీరు సైబర్‌దాడి జరిపినట్లు తెలిపింది. ‘‘సైబర్ క్రిమినల్స్‌కు చైనా నెలవుగా మారిందని అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ జెఫరీ రోజెన్ అన్నారు.