దేశంలో తొలి కరోనా మరణం
ABN , First Publish Date - 2020-03-13T08:28:45+05:30 IST
దేశంలో తొలి కరోనా మరణం నమోదైంది. జలుబు, దగ్గు, జ్వ రం వంటి లక్షణాలతో బాధపడుతూ హైదరాబాద్‌లో కన్నుమూసిన కన్నడిగుడు....

- కొవిడ్-19తోనే కలబుర్గివాసి మృతి
- పాజిటివ్‌గా తేలిన సిద్దికీనమూనా
- కర్ణాటక మంత్రి శ్రీరాములు ధ్రువీకరణ
- హైదరాబాద్ ఆస్పత్రిలో మరణం.. అప్రమత్తం చేసిన కర్ణాటక
- 74కు చేరిన కరోనా కేసులు.. ఇరాన్‌కు మూడు విమానాలు
- విదేశీ ప్రయాణాలొద్దు.. వెళ్లొస్తే 14 రోజులపాటు క్వారంటైన్
- విదేశీయులపై నిషేధం లేదు.. ముందు జాగ్రత్తగా వీసాల నిలిపివేత
- పెద్ద ఎత్తున వ్యాపించట్లేదు.. భయపడొద్దు: కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్,బెంగళూరు,న్యూఢిల్లీ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): దేశంలో తొలి కరోనా మరణం నమోదైంది. జలుబు, దగ్గు, జ్వ రం వంటి లక్షణాలతో బాధపడుతూ హైదరాబాద్‌లో కన్నుమూసిన కన్నడిగుడు.. కలబుర్గివాసి మహ్మద్ హుస్సేన్ సిద్దిఖీ (76) నమూనాలు కొవిడ్-19 పాజిటివ్‌గా తేలాయి. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు ట్విటర్ ద్వారా ధ్రువీకరించారు. ఆయనతో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి ఐసోలేషన్‌కు తరలించడం వంటి చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. సిద్దిఖీ హైదరాబాద్‌లో 2 ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొం దిన నేపథ్యంలో తెలంగాణ ప్ర భుత్వాన్ని కర్ణాటక సర్కారు అప్రమత్తం చేసింది. దీంతో సిద్దిఖీ చికిత్స పొందిన ఆస్పత్రుల్లో వైద్యం చేసిన డాక్టర్లు, సిబ్బంది, ఆయనను ఎవరెవ రు కలిశారనే విషయాలను ఆరా తీస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు శుక్రవారం వెల్లడిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కాగా.. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 74కు చేరింది. వారిలో 16 మంది ఇటాలియన్లు కాగా ఒకరు భారత మూలాలున్న కెనడా వైద్యురాలు.
ఆమె లఖ్‌నవులోని కేజీఎంయూలో చికిత్స పొందుతున్నారు. మరోసారి నిర్ధారించుకొనేందుకు ఆమె నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఏపీలోని నెల్లూరువాసికి కరోనా పాజిటివ్ అని పుణెలోని వైరాలజీ ల్యాబ్ కూడా తేల్చింది. కర్నూలు జిల్లాలో ముగ్గురు కరోనా అనుమానిత లక్షణాలతో పెద్దాస్పత్రి ఐసోలేషన్‌వార్డులో చేరారు. కర్ణాటకలో ఇప్పటికే నాలుగు కేసులు పాజిటివ్‌గా తేలగా.. గ్రీస్ నుంచి బెంగళూరు వచ్చిన 26 ఏళ్ల యువకుడికి కూడా వైరస్ సోకినట్టు వైద్యులు గురువారం నిర్ధారించారు. మరో 8 మంది అనుమానితులను అబ్జర్వేషన్‌లో ఉంచారు. మహారాష్ట్రలోని పుణె వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. దీంతో మహారాష్ట్రలో కేసుల సంఖ్య 12కు చేరింది. కేరళలో ఇద్దరికి వైరస్ పాజిటివ్ వచ్చినట్టు ఆ రాష్ట్ర సీఎం పినరాయి విజయన్ తెలిపారు. ఢిల్లీలో కరోనాసోకిన వ్యక్తి తల్లి కూడా దాని బారిన పడ్డారు. లద్దాఖ్‌లోనూ ఇరాన్‌కు వెళ్లొచ్చి న ఒక వ్యక్తికి కరోనా సోకింది.
ఈ 74 మందిని తాకిన 1500 మందిని, దేశవ్యాప్తంగా 30 వేల మందిని పరిశీలనలో ఉంచినట్టు కేం ద్ర ఆరోగ్య శాఖ అధికారి లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా నిర్ధారణకు ఉపయోగించే కిట్లు లక్ష దాకా ఉన్నాయని, మరిన్ని కిట్ల తయారీకి ఆర్డర్ ఇచ్చామని చెప్పారు. మనదేశంలో కరోనా పెద్దగా వ్యా పించట్లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాగా..శుక్రవారం నుంచి దశలవారీగా 3 విమానాల్లో ఇరాన్ నుంచి మనవాళ్లను ఇక్కడికి తీసుకొస్తామని పౌరవిమానయాన శాఖ తెలిపింది. మధ్యాహ్నం 12.30గంటలకు 200 మంది భారతీయులతో ఇరాన్ నుంచి ఒక విమానం ముంబైకి చేరుకుంటుందని ఆ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆదివారం(మార్చి 15) మరో విమానం లో మరికొంతమందిని ఢిల్లీకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. మూడో విమానం మార్చి 16న లేదా 17న ఇరాన్‌కు వెళ్లి మనవాళ్లను తీసుకొస్తుందని వివరించారు.
భయం వద్దు.. బాధ్యతగా
‘‘విదేశాలకు అనవసర ప్రయాణాలు చేయొద్దని భారతీయులందరికీ సూచిస్తున్నాం. ఫిబ్రవరి 15 తర్వాత చైనా, ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ దేశాల్లో పర్యటించిన ప్రతి ఒక్కరూ 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండి తీరాల్సిందే’’ అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ లోక్‌సభలో అన్నారు. కరోనా ముప్పును ఎదుర్కొనే విషయంలో బాధ్యతాయుతంగా, తెలివిగా వ్యవహరించాల్సి ఉందని, భయాందోళనలకు గురి కాకూడదని పేర్కొన్నారు. ఈ వీసాలను, ఆన్ అరైవల్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్పారు. విదేశీయులకు భారత్‌లోకి ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించలేదని, కరోనా విస్తృతి ఎక్కువగా ఉన్నదేశాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ భాగం విదేశీ ప్రయాణాలు చేసినవారివేనని తెలిపారు. ఇరాన్‌లో 6000 మందికిపైగా భారతీయులు ఉన్నారని, వారిలో 1100 మంది లద్దాఖ్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర నుంచి వెళ్లిన యాత్రికులని చెప్పారు. జమ్ముకశ్మీర్‌కు చెందిన 300 మంది విద్యార్థులు, కేరళ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 1000 మంది జాలర్లు ఇరాన్‌లో చిక్కుకుపోయినట్టు వెల్లడించారు. వారందరినీ భారత్‌కు సురక్షితంగా తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. వాణిజ్య విమానాలను నడిపేలా ఇరాన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ఇటలీలోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అక్కడి నుంచి కూడా కరోనా నెగెటివ్‌గా తేలిన మనవాళ్లను వీలైనంత త్వరగా తీసుకువస్తామని చెప్పారు.
గత 20 రోజుల్లో మనదేశానికి వస్తున్న ప్రయాణికుల సంఖ్య 40శాతం మేర తగ్గిపోయిందని కేంద్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి అవసరమైన మందులను తయారుచేయడానికి కావాల్సిన ఔషధ ముడిపదార్థాలు పుష్కలంగా ఉన్నాయని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ తెలిపింది. కాగా.. విదేశాల నుంచి తరలిస్తున్న భారతీయుల కోసం, కరోనా బాధితుల కోసం జైసల్మేర్, సూరత్‌గఢ్, ఝాన్సీ, జోధ్‌పూర్, దేవ్‌లాలి, కోల్‌కత, చెన్నైల్లో కొత్తగా 7 క్వారంటైన్లు నిర్మించినట్టు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే చాలు: ప్రధాని
‘భయం వద్దు.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి’ అని దేశ ప్రజలకు ప్రధాని మోదీ సూచించారు. కరోనాపై ఆయన గురువారం వరుస ట్వీట్లు చేశారు. అనవసరపు ప్రయాణాలు మానుకోవాలని, బహిరంగ ప్రదేశాలకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. తన మంత్రివర్గ సహచరులు కూడా విదేశీ ప్రయాణాలకు కొంత కాలం పాటు దూరంగా ఉంటారని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు సహకరించాలని ఎంపీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ కోరారు. నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
వ్యాక్సిన్ తయారీకి రెండేళ్లు.. 11 వైరస్‌లను వేరు చేయగలిగాం
సాధారణంగా ల్యాబ్‌లో కరోనా వైర్‌సను వేరు చేయడం కష్టమని.. అలాంటిది పుణెలోని వైరాలజీ ల్యాబ్‌లో మన శాస్త్రజ్ఞులు 11 వైర్‌సలను ఐసోలేట్ చేయగలిగారని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే, కరోనాను నిరోధించే టీకాను తయారు చేయడానికి మాత్రం ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పడుతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్)లోని ఎపిడమియాలజీ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్-1 (ఈసీడీ-1) విభాగాధిపతి రమణ్ ఆర్ గంగాఖేడ్కర్ తెలిపారు.