దేశంలోని అనేక రాష్ట్రాల్లో అగ్నిప్రమాదం!
ABN , First Publish Date - 2020-11-15T06:35:03+05:30 IST
దీపావళి సందర్భంగా దేశం మొత్తం వెలుగులతో జిగేలుమంది. దేశప్రజలు టపాసులతో సంబరాలు చేసుకున్నారు. ఇదే సమయంలో

న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా దేశం మొత్తం వెలుగులతో జిగేలుమంది. దేశప్రజలు టపాసులతో సంబరాలు చేసుకున్నారు. ఇదే సమయంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో వివిధ కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కోల్‌కతాలోని నివేదిత పల్లిలోని ఓ స్లమ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో అనేక ఇళ్లు పూర్తిగా దగ్దమయ్యాయి. ఐదు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలకు అదుపులోకి తీసుకొస్తున్నాయి. ఈ ఘటనలో ఎవరైనా మరణించారా అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క మహరాష్ట్రలోనూ అనేక ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ముంబాయిలోని బైకుల్లా ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదని.. ప్రస్తుతం రెస్టారెంట్ సాధారణ స్థితిలోకి వచ్చేసినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో ఐదు ప్రాంతాల్లో అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గార్సా, నియోలి, దుర్గా నగర్, పీజ్ ప్రాంతాల్లోని అనేక ప్రదేశాల్లో మంటలు చెలరేగాయి. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది ఈ ప్రాంతాల్లో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. ఈ ఐదు ప్రాంతాల్లో ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఉత్తరాఖండ్‌లోని ఓ ఫర్నీచర్ హౌస్‌లో సైతం శనివారం రాత్రి మంటలు చెలరేగాయి. ఉత్తరకాశీలోని పీపల్ మండిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదు ఫైర్ ఇంజిన్లు వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపుచేసింది.

జమ్మూకశ్మీర్‌లోని ఉదాంపూర్ జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ టూ వీలర్ షోరూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మూడు ఫైర్ ఇంజిన్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చాయి. మంటలను ఆర్పే సమయంలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బందికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. మంటల కారణంగా షోరూమ్‌లో భారీ ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. హైదరాబాద్‌లోనూ పలు చోట్ల మంటలు చెలరేగాయి. రంగారెడ్డిలోని మంకాల్ పారిశ్రామికవాడలో ఉన్న సరాయివాలా ఆయిల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ పరిశ్రమ రెండు సంవత్సరాల క్రితమే మూతపడటంతో ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
