కరోనా వైరస్ మహమ్మారిపై పోరు : మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని ప్రశంసలు

ABN , First Publish Date - 2020-03-16T00:24:23+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలను ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ ప్రశంసించారు.

కరోనా వైరస్ మహమ్మారిపై పోరు : మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని ప్రశంసలు

కాన్ బెర్రా (ఆస్టేలియా) : కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రయత్నాలను ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ ప్రశంసించారు.  జీ-20 దేశాల నేతల మధ్య అనుసంధానం ఏర్పాటు చేయడానికి మోదీ చేస్తున్న ప్రయత్నాలకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. 


కరోనా వైరస్ మహమ్మారిపై నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రధాని మారిసన్ స్పందించారు. తాను బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌తో మాట్లాడినట్లు, జీ-20 దేశాల నేతల మధ్య అనుసంధానం ఏర్పాటు చేయడానికి పీఎం మోదీ చేస్తున్న ప్రయత్నాలకు ఆస్ట్రేలియా మద్దతిస్తుందని చెప్పినట్లు తెలిపారు. మోదీ చొరవ మెచ్చుకోదగినదని పేర్కొన్నారు. ఈ చొరవకు ఆస్ట్రేలియా కచ్చితంగా మద్దతిస్తుందన్నారు. 


ఈ మహమ్మారి ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని పరిశీలించేందుకు జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి తాను, బ్రిటిష్ పీఎం జాన్సన్ అంగీకరించినట్లు మారిసన్ చెప్పారు. ఇది ఆరోగ్య సంక్షోభమని, అయినప్పటికీ దీని ప్రభావం ఆర్థికంగా తీవ్రంగా ఉంటుందని చెప్పారు. 


ఇప్పటి వరకు 130 దేశాల్లో కరోనా వైరస్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.


Updated Date - 2020-03-16T00:24:23+05:30 IST