మళ్లీ తెరపైకి ఫెడరల్‌ ఫ్రంట్‌!

ABN , First Publish Date - 2020-12-06T07:33:17+05:30 IST

దేశంలో యూపీఏ, ఎన్డీఏలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ దిశగా కసరత్తు సాగుతున్నట్లు కనిపిస్తోంది.

మళ్లీ తెరపైకి ఫెడరల్‌ ఫ్రంట్‌!

కుమారస్వామికి సీఎం కేసీఆర్‌ ఫోన్‌..భేటీ అవుదామని కోరిన ముఖ్యమంత్రి

సానుకూలమన్న జేడీఎస్‌ కీలక నేత

ఖండించిన ప్రగతి భవన్‌ వర్గాలు..


బెంగళూరు, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): దేశంలో యూపీఏ, ఎన్డీఏలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ దిశగా కసరత్తు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులోభాగంగానే.. జనతాదళ్‌ సెక్యులర్‌ (జేడీఎస్‌) పార్టీ ముఖ్య నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ఫోన్‌ చేసి భేటీ అవుదామని కోరారు. ఈ విషయాన్ని శనివారం కుమార స్వామి మైసూరులో మీడియాకు వివరించారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ రహిత ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి జరిగే సభలో తప్పకుండా పాల్గొనాలని భవిష్యత్తులో కలిసి నడుద్దామని కోరారు. పాల్గొనేందుకు నేను సిద్ధమని హామీ ఇచ్చా’ అని తెలిపారు. 


2018లోనూ దేవెగౌడను కలిసిన కేసీఆర్‌

ఫెడరల్‌ ఫ్రంట్‌పై కేసీఆర్‌  2018 నుంచి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఏడాది ఏప్రిల్‌ 13న స్వయంగా బెంగళూరు వచ్చిన కేసీఆర్‌.. జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. అయితే, ఆ ప్రయత్నాలు ముందుకుసాగలేదు. మరోవైపు2019లో బీజేపీ వ్యతిరేక కూటమిలో కీలకంగా వ్యవహరించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పలుసార్లు దేవెగౌడతో చర్చలు జరిపారు. తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. జేడీఎస్‌ కాంగ్రె్‌సతో కలిసి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. 18 నెలల పాలన తర్వాత సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. ప్రస్తుతం కర్ణాటకలో జేడీఎ్‌సకు ఏ పార్టీతోనూ సంబంధాలు లేవు. నేరుగా అయితే 2024లో, జమిలి అయితే ఏడాది ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో మరోసారి కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సిద్ధమైనట్లు అనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాలను కుమారుడు కేటీఆర్‌కు అప్పగించి జాతీయ రాజకీయాల వైపు వెళ్లే ఆలోచనలో ఉన్న కేసీఆర్‌.. లోక్‌సభ ఎన్నికలు మూడేళ్లు ఉండగానే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో జేడీఎ్‌సకు ఒకే ఒక లోక్‌సభ సభ్యుడు ప్రజ్వల్‌ రేవణ్ణ (హసన్‌) ఉన్నారు. ఈయన దేవెగౌడకు మనమడు. కాగా, ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి కుమారస్వామికి కేసీఆర్‌ ఫోన్‌ చేసిన విషయమై ప్రగతి భవన్‌ వర్గాలను వివరణ కోరగా.. అలాంటిదేమీ లేదని వివరణ ఇచ్చాయి.

Updated Date - 2020-12-06T07:33:17+05:30 IST