లద్దాఖీల గుండెల్లో ఇండియా..!

ABN , First Publish Date - 2020-09-20T22:31:07+05:30 IST

ఇండియాను గుండెల్లో పెట్టుకున్న దేశభక్తులకు మన దేశంలో కొదవ లేదు. అలాంటి వారిలో కొందరు దేశం కోసం ప్రాణాలిస్తారు. మరి కొందరు దేశం కోసం ప్రాణాలిచ్చే పిల్లలకు జన్మనిస్తారు. అలాంటి వ్యక్తే లద్దాఖ్‌కు చెందిన...

లద్దాఖీల గుండెల్లో ఇండియా..!

'నీవు ఇండియాలో ఉంటే ఇండియన్‌ కావు.. నీ గుండెల్లో ఇండియా ఉంటేనే ఇండియన్‌ అవుతావ్‌..' ఎంత గొప్పగా ఉందో కదా.. దేశ భక్తి గురించి చెప్పే ఈ డైలాగ్‌. ఇండియాను గుండెల్లో పెట్టుకున్న దేశభక్తులకు మన దేశంలో కొదవ లేదు. అలాంటి వారిలో కొందరు దేశం కోసం ప్రాణాలిస్తారు. మరి కొందరు దేశం కోసం ప్రాణాలిచ్చే పిల్లలకు జన్మనిస్తారు. అలాంటి వ్యక్తే లద్దాఖ్‌కు చెందిన టీ దోర్జే. ఆయనకు ముగ్గురు కొడుకులు. వారిలో ఇద్దరు లద్దాఖ్‌ స్కౌట్స్‌ తరపున భారత సైన్యంలో ఉన్నారు. తన పిల్లలు సైన్యానికి సేవ చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందని, అలాంటి కొడుకులను కన్నందుకు సంతోషపడుతున్నానని దోర్జే చెబుతున్నారు. మూడో కొడుకును కూడా త్వరలో స్కౌట్స్‌లో చేర్చుతానని అంటున్నారు. 


భారత్-చైనా సైన్యం మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మంచుకొండల మధ్య ప్రాణాలకు తెగించి సైన్యం కాపలా కాస్తోంది. ఈ నేపథ్యంలో దోర్జేకు ఆయన పిల్లలతో కనీస కమ్యూనికేషన్‌ కూడా ఉండడం లేదు. దీనిపై ఆందోళన కలగడం లేదా..? అని ప్రశ్నిస్తే.. ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా..? 'దేశం కోసం ప్రాణాలిచ్చే అదృష్టం ఎంతమందికుంటుంది.. అలాంటి అదృష్టం నా పిల్లలకు దక్కితే అందుకు నేను బాధపడను.. గర్వంగా భావిస్తా.. అయినా చావంటే భయపడితే దేశం ఎలా నడుస్తుంది?' అని ఎదురు ప్రశ్నవేస్తున్నారు.


చైనా సైన్యాన్ని ప్లాస్టిక్‌ సైన్యంతో పోల్చిన దోర్జే.. తమ పిల్లలు దేశం కోసం శత్రు సైన్యంతో పోరాడుతుండడం ఎంతో గర్వంగా ఉంటుందని చెబుతున్నారు. లద్దాఖీలకు భయం అంటే తెలియదని, తన బిడ్డలు వీరులని, శత్రువులను చీల్చి చెండాడగలరని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దోర్జే భార్య కూడా తమ పిల్లలు దేశ సేవ చేస్తుండడం గర్వంగా ఉంటుందని, అయితే ఒక్కోసారి వారు గుర్తుకు వచ్చినప్పుడు కొంత బాధ కూడా కలుగుతుందని కన్నీరు పెట్టుకున్నారు.


లద్ధాఖ్ కే చెందిన వాంగ్‌ చుక్‌ తనయుడు కూడా భారత సైన్యంలో సేవలందిస్తున్నాడు. ఆయన కూడా తన బిడ్డ భారత్‌ సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తానని చెప్పారు. 'సైన్యంలో ఉన్న ప్రతి సైనికుడి ప్రాణాల గురించి కుటుంబం ఆందోళన చెందుతుంది. కానీ మా బిడ్డలు భారత మాత రక్షణ కోసం పోరాడుతున్నారన్న ఆలోచనే గొప్పగా అనిపిస్తుంది. అవసరమైతే నేను కూడా దేశం తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉంటా'నని 50ఏళ్ల వాంగ్‌ చుక్‌ చెప్పడం ఆయన దేశ భక్తికి నిదర్శనం. ఇలాంటి తల్లిదండ్రులు ఇంకెందరో లద్దాఖ్ లో ఉన్నారు. వారందరి దేశ భక్తికి ఓ సెల్యూట్.


భారత సైన్యంలో లద్దాఖీ స్కౌట్స్‌ రెజిమెంట్ కు గొప్ప స్థాయి ఉంది. స్నో టైగర్స్‌, స్నో వారియర్స్‌ అని వారిని పిలుచుకుంటారు. మంచు కొండల్లో తిరుగులేని వీరులుగా వీరికి పేరుంది. దూర్భేద్యమైన మంచు ప్రాంతాల్లో కూడా వీరు సునాయాసంగా ప్రవేశించి శత్రువును మట్టు పెట్టే సామర్థ్యం వీరి సొంతం.

Updated Date - 2020-09-20T22:31:07+05:30 IST