ఎట్టకేలకు ఫరూక్ అబ్దుల్లా గృహ నిర్బంధం ఎత్తివేత
ABN , First Publish Date - 2020-03-13T20:27:35+05:30 IST
జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై విధించిన గృహ నిర్బంధాన్ని ప్రభుత్వం ఎట్టకేలకు ఎత్తివేసింది. శ్రీనగర్‌లో గుప్కార్ రోడ్డులోని ఆయన...

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై విధించిన గృహ నిర్బంధాన్ని ప్రభుత్వం ఎట్టకేలకు ఎత్తివేసింది. శ్రీనగర్‌లో గుప్కార్ రోడ్డులోని ఆయన నివాసంలో ఫరూక్ అబ్దుల్లాను గత ఏడు నెలలుగా నిర్బంధించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంగా గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆయనను హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గృహ నిర్బంధంలోకి తీసుకున్న కొద్ది రోజుల తర్వాత సెప్టెంబర్ 17న ప్రభుత్వం ఆయనపై ప్రజా భద్రత చట్టాన్ని (పీఎస్ఏ)ని ప్రయోగించింది. ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు సహా జమ్మూ కశ్మీర్‌లో నిర్బంధంలోకి తీసుకున్న రాజకీయ నేతలందర్నీ విడుదల చేయాలంటూ ఎనిమిది రాజకీయ పార్టీలు ప్రధాని మోదీకి ఉమ్మడిగా తీర్మానం పంపిన నాలుగు రోజులకే ఫరూక్ అబ్దుల్లాకి విముక్తి లభించడం గమనార్హం.