అవన్నీ తప్పుడు ఆరోపణలు: ఫారూఖ్ అబ్దుల్లా
ABN , First Publish Date - 2020-11-25T21:49:55+05:30 IST
చట్టవిరుద్ధంగా భూమిని స్వాధీనం చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నట్లు కశ్మీర్ అధికారులు తేల్చారు

శ్రీనగర్: తనను, తన కుమారుడిపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, గుప్కార్ అలయెన్స్ నేత ఫారూఖ్ అబ్దుల్లా అన్నారు. తన ఇల్లు 1998లో కట్టుకున్నానని, ప్రతి ఇంచు భూమిని చట్ట పరంగా కొనుక్కున్నానని ఆయన పేర్కొన్నారు. తనను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఆరోపణలు పుట్టిస్తున్నారని విమర్శించారు. కాగా, ఈ కేసులో వీరిని త్వరలోనే సీబీఐ విచారించనుంది.
ఓ భూకబ్జా కేసులో ఫారూఖ్ అబ్దుల్లాతో పాటు ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాకు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీని విలువ రూ.25వేల కోట్ల ఉంటదనే వాదనలు వినిపిస్తున్నాయి. చట్టవిరుద్ధంగా భూమిని స్వాధీనం చేసుకుని ఇళ్లు నిర్మించుకున్నట్లు కశ్మీర్ అధికారులు తేల్చారు. ఈ స్కాంతో సంబంధమున్న వారికి సంబంధించిన వివరాలతో కశ్మీర్ అధికార యంత్రాంగం మంగళవారంనాడు ఓ జాబితా విడుదల చేసింది. జాబితాలో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతల పేర్లున్నాయి.