నోయిడా-ఢిల్లీ సరిహద్దు నుంచి వైదొలగిన రైతులు

ABN , First Publish Date - 2020-12-13T20:31:50+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నోయిడా-ఢిల్లీ లింక్ రోడ్డులో

నోయిడా-ఢిల్లీ సరిహద్దు నుంచి వైదొలగిన రైతులు

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నోయిడా-ఢిల్లీ లింక్ రోడ్డులో ధర్నా చేస్తున్న రైతులతో కేంద్ర మంత్రుల చర్చలు సత్ఫలితాలు ఇచ్చాయి. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్ శనివారం రాత్రి పొద్దుపోయాక జరిపిన చర్చల మేరకు ఈ రోడ్డులోని చిల్లా పోస్ట్ నుంచి రైతులు ఖాళీ చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయాలు తొలగినట్లు అధికారులు చెప్పారు. 


నోయిడా-ఢిల్లీ లింక్ రోడ్డులోని చిల్లా వద్ద డిసెంబరు 1 నుంచి రైతులు ధర్నా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ-నోయిడా-ఢిల్లీ, కాళింది కుంజ్ మార్గాల్లో వాహనాల రాకపోకలు సాధారణ స్థితికి చేరినట్లు అధికారులు తెలిపారు. 


ఇదిలావుండగా భారతీయ కిసాన్ యూనియన్ (భాను)కు చెందిన రైతులు చిల్లా వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సంఘం నేత ఒకరు మాట్లాడుతూ రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర సింగ్ తోమర్ రైతులతో చర్చించారని, అనంతరం రహదారుల నుంచి రైతులు వైదొలగారని తెలిపారు. తమ డిమాండ్లను రాజ్‌నాథ్ సింగ్ సానుకూలంగా విన్నారని, చర్చలను ముందుకు తీసుకెళ్ళేందుకు అంగీకరించారని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. రాజ్‌నాథ్ ఇచ్చిన హామీతో తాము రోడ్డును ఖాళీ చేశామని చెప్పారు. అయితే తమ నిరసన ముగిసినట్లు భావించరాదని చెప్పారు. 


Updated Date - 2020-12-13T20:31:50+05:30 IST