కేంద్రం ఆ ఒక్కపనీ చేస్తే ఇళ్లకు వెళ్లిపోతాం: బీకేయూ

ABN , First Publish Date - 2020-12-12T00:59:54+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళనను విరమించే ప్రసక్తే ...

కేంద్రం ఆ ఒక్కపనీ చేస్తే ఇళ్లకు వెళ్లిపోతాం: బీకేయూ

గజియాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని రైతుల సంఘాలు మరోసారి స్పష్టం చేశాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో రైతులు చేపట్టిన ఆందోళన 16వ రోజుకు చేరిన నేపథ్యంలో రైతులు ఈ మేరకు పేర్కొన్నారు. ‘‘రైతులు, కేంద్రానికి మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలిగిపోయేందుకు ఒక్కటే మార్గం. ఇరు పక్షాలూ వెనక్కి తగ్గాలి. కేంద్రం కొత్త చట్టాలను కొట్టేయాలి... రైతులు ఇళ్లకు వెళ్లిపోవాలి...’’ అని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికైత్ పేర్కొన్నారు. రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య మరో దఫా చర్చలు జరుగుతాయా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... ‘‘ఒక వేళ ప్రభుత్వం చర్చల కోసం ఆహ్వానం పంపితే.. తదుపరి చర్చల వల్ల కలిగే ప్రయోజనంపై రైతులు ఆలోచించుకోవాల్సి ఉంటుంది...’’ అని బీకేయూ ప్రతినిధి పేర్కొన్నారు. డిసెంబర్ 9న కేంద్రం చేసిన ప్రతిపాదనలను తిరస్కరించిన అనంతరం తమ ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నట్టు రైతు సంఘాలు పేర్కొన్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ 14న బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని రైతు నేతలు ప్రకటించారు. ఈ నెల 12న ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిని దిగ్బంధిస్తామనీ... దేశం నలుమూలల నుంచి రైతులను ఢిల్లీలో ఆందోళన కోసం ఆహ్వానిస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి.

Updated Date - 2020-12-12T00:59:54+05:30 IST