రైతు ఆందోళనపై లేఖాయణం

ABN , First Publish Date - 2020-12-20T08:27:55+05:30 IST

దేశ రాజధాని పొలిమేరల్లో 24 రోజులుగా సాగుతున్న రైతుల ఆందోళన సమసిపోయే సూచనలు కనిపించడం లేదు. చర్చలకు రావాలన్న

రైతు ఆందోళనపై లేఖాయణం

తోమర్‌ లేఖను 9 భాషల్లో షేర్‌ చేసిన మోదీ..

మా వెనుక ఏ పార్టీ అజెండా లేదు: రైతులు

దళారీ నేతలపై కేంద్రం ఐటీ దాడులు

సుప్రీం కమిటీలో చేరదామా? వద్దా ?

రైతుల తర్జనభర్జన... రెండ్రోజుల్లో నిర్ణయం

గడ్డ కట్టే చలిలో 24 రోజులుగా నిరసన


న్యూఢిల్లీ, డిసెంబరు 19: దేశ రాజధాని పొలిమేరల్లో 24 రోజులుగా సాగుతున్న రైతుల ఆందోళన సమసిపోయే సూచనలు కనిపించడం లేదు. చర్చలకు రావాలన్న ప్రధాని విజ్ఞాపనపై రైతు సంఘాలు శనివారంనాడు చర్చించాయి. అయితే చట్టాల రద్దుకు ఆయన తిరస్కరించడంతో తమ పట్టును కూడా సడలించరాదని, ఎన్ని రోజులైనా దీన్ని సాగించాలని మెజారిటీ యూనియన్లు గట్టిగా వాదిస్తున్నాయి. కాగా రైతుల డిమాండ్ల పరిశీలనకు ‘నిష్పక్షపాతమైన, స్వతంత్ర కమిటీని’ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు నిర్ణయంపై రైతు సంఘాలు సుదీర్ఘంగా చర్చించాయి. ఒకవేళ అలాంటి కమిటీ ఏర్పడితే అందులో చేరాలా వద్దా అన్న దానిపై మల్లగుల్లాలు పడ్డాయి. చేరితే అది ప్రభుత్వ వైఖరిని ఒప్పుకున్నట్లేనని, చట్టాల రద్దు జరిగేదాకా ఎలాంటి కమిటీల్లోనూ చేరొద్దని కొందరు నేతలు వాదించినట్లు బల్బీర్‌సింగ్‌ అనే నాయకుడు వెల్లడించారు. ఈ విషయంపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని, దీనిపై న్యాయసలహా కూడా తీసుకుంటున్నామని, 2-3 రోజుల్లో ఓ నిర్ణయానికి వస్తామని రైతు నేత శివ్‌కుమార్‌ కక్కా చెప్పారు. 


కాగా- అటు రైతులు, ఇటు ప్రధాని మోదీ పరస్పరం లేఖలు సంధించుకున్నారు. రైతులను ఎలాగైనా ఒప్పించాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రధాని- శుక్రవారంనాడు వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్‌ హిందీలో రైతు సంఘాలకు రాసిన 8 పేజీల లేఖను 9 ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేసి తన ట్విటర్‌ ఖాతా ద్వారా షేర్‌ చేశారు.  తెలుగు, తమిళ, కన్నడ, మళయాళీ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, ఒడియా భాషల్లో- అంటే బీజేపీ అధికారంలో లేని మెజారిటీ రాష్ట్రాల్లో- దీన్ని షేర్‌ చేశారు. కేవలం ఆందోళన చేస్తున్న ఉత్తరాది రాష్ట్రాల రైతులకే కాక- దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ దీన్ని వ్యూహాత్మకంగా పంపడం ద్వారా ఆయనే దీనిని జాతీయ అంశంగా మార్చేశారన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు- విపక్షాలు రెచ్చగొట్టడం వల్లే రైతులు ఆందోళనకు దిగారంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలను రైతు యూనియన్లు తోసిపుచ్చాయి. తాము చేస్తున్న డిమాండ్ల వెనుక ఏ రాజకీయ పక్షమూ లేదని స్పష్టం చేస్తూ ఆలిండియా కిసాన్‌ సంఘర్ష్‌ కోఆర్డినేషన్‌ కమిటీ -మోదీకి, తోమర్‌కు హిందీలో ఓ లేఖాస్త్రాన్ని సంధించింది. ‘‘వాస్తవమేంటంటే రైతుల ఆందోళన వల్ల రాజకీయ పక్షాల వైఖరిలో మార్పు వచ్చింది. అంతేకానీ, మీరు (ప్రధాని) చెబుతున్నట్లు పార్టీలే ఆందోళనకు ఉసికొల్పాయన్నది నిజం కాదు.. చర్చల విషయంలో రైతులను మంత్రే (తోమర్‌) తప్పుదోవ పట్టిస్తున్నారు. మా డిమాండ్‌లు స్వచ్ఛందంగా చేస్తున్నవి తప్ప రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కాదు’’ అని ఆందోళన చేస్తున్న 40 యూనియన్ల సంయుక్త వేదిక అయిన ఏఐకేఎ్‌ససీసీ స్పష్టం చేసింది. 


కమిషన్‌ ఏజెంట్లపై ఐటీ దాడులు

రైతు ఆందోళనను రెచ్చగొడుతున్నట్లుగా అనుమానిస్తున్న దళారీ వ్యవస్థపై కేంద్రం ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అర్తియా (కమిషన్‌ ఏజెంట్ల) నివాసాలపై ఆదాయపు పన్ను దాడులు జరుగుతున్నాయి. పంజాబ్‌ అంతటా ఉన్న దాదాపు 14 మంది అగ్రశ్రేణి దళారీ ఏజెంట్‌ నేతలకు ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. కొందరు ఇళ్లపై సోదాలు జరిగాయి. వీరే కాకుండా మండీల్లో చక్రం తిప్పుతున్న అనేకమందిని కూడా ఐటీ శాఖ టార్గెట్‌ చేసింది. సీఆర్‌పీఎఫ్‌ బలగాలను వెంటేసుకుని మరీ ఐటీ దాడులు జరుపుతున్నారని, ఇది రైతులను రెచ్చగొట్టడమేనని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ తీవ్రంగా ధ్వజమెత్తారు.  మరోవైపు ఆందోళన సందర్భంగా ఈ 24 రోజుల్లో 33 మంది రైతులు చనిపోయారని రైతుసంఘాల నేతలు చెప్పారు. చలి వల్లో, అనారోగ్యం వల్లో , రోడ్డు ప్రమాదాల్లోనో అన్నదాతలు మరణించారని, వారికి నివాళిగా ఆదివారంనాడు మౌనదీక్ష, శ్రద్ధాంజలి ఘటిస్తామని వారు తెలిపారు. ఢిల్లీలో ప్రస్తుతం 3.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇది వచ్చే కొద్ది రోజుల్లో మరింత పడిపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఆందోళన కారణంగా ఢిల్లీకి వెళ్లే ప్రధాన రహదారులన్నీ ఇప్పటికీ మూతపడే ఉన్నాయి. 


రైతుల కోసమే సంస్కరణలు

6నెలల క్రితమే ప్రారంభించాం.. అసోచామ్‌ సదస్సులో ప్రధాని

రైతుల ప్రయోజనార్థం ఆరునెలల క్రితమే వ్యవసాయ సంస్కరణలను ప్రారంభించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం అసోచామ్‌ వ్యవస్థాపక వారాంతర సదస్సులో ఆయన మాట్లాడుతూ, రైతుల ఉద్యమ డిమాండ్లపై స్పందించారు. కరోనా వ్యాప్తి కాలంలో సైతం రికార్డుస్థాయిలో ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు), ఎఫ్‌పీఐలను (విదేశీ ప్రభుత్వాల పెట్టుబడులు) సాధించామని తెలిపారు. దీంతో భారత్‌లో పెట్టుబడులు ఎందుకు పెట్టాలనే పాత వైఖరి స్థానంలో ఎందుకు పెట్టకూడదనే కొత్త ఒరవడి ప్రపంచవ్యాప్తంగా మొదలయిందని వివరించారు. కాగా, ఇటీవలి వ్యవసాయ సంస్కరణలు రైతులకు ఎలా దోహదపడతాయనేది వివరిస్తూ రూపొందించిన ఈ-బుక్‌లెట్‌ను శనివారం తన ట్విటర్‌ ఖాతాద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేశారు. సంస్కరణలతో విజయాలను అందుకొన్న రైతుగాథలతో నిండిన ఈ బుక్‌లెట్‌లను అందరూ అధ్యయనం చేయాలని, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్‌ చేయాలని దేశప్రజలను ఆయన కోరారు.

Updated Date - 2020-12-20T08:27:55+05:30 IST