రైతుల నిరసనలు : కాంగ్రెస్‌పై శివసేన ఆగ్రహం

ABN , First Publish Date - 2020-12-26T21:05:51+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల పట్ల కాంగ్రెస్ నేతృత్వంలోని

రైతుల నిరసనలు : కాంగ్రెస్‌పై శివసేన ఆగ్రహం

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల పట్ల కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు సానుకూలతను సాధించలేకపోతున్నాయని శివసేన ఆరోపించింది. యూపీయే సారథ్య బాధ్యతల నుంచి కాంగ్రెస్ వైదొలగి, శరద్ పవార్‌కు ఆ బాధ్యతలను అప్పగించాలని పరోక్షంగా సలహా ఇచ్చింది. మరోవైపు రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొంది. అక్కడితో ఆగకుండా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కూడా విరుచుకుపడింది. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా పని చేస్తోందని దుయ్యబట్టింది. ‘సామ్నా’ సంపాదకీయంలో శివసేన ఈ వ్యాఖ్యలు చేసింది.


నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా పని చేస్తోందని ఆరోపించింది. బీజేపీని వ్యతిరేకించే నేతలందరినీ యూపీయేలో భాగస్వాములను చేయకపోతే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు ప్రతిపక్షం వెలవెలబోతుందని పేర్కొంది. ప్రియాంక గాంధీ వాద్రాను దేశ రాజధానిలో అరెస్టు చేశారని, రాహుల్ గాంధీని తేలిగ్గా తీసుకుంటున్నారని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పని చేయనివ్వడం లేదని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని వ్యాఖ్యానించింది. 


శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశాయి. ఈ ప్రతినిధి బృందంలో శివసేన లేదు. శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ ప్రతిపక్షాల నేతలతో కలిసి తాము ఎందుకు వెళ్ళాలని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్తూ, తాము రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్‌సీపీలతో పొత్తు పెట్టుకున్నామని, ఢిల్లీలో తమకు సొంత గుర్తింపు ఉందని అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయేలో శివసేన భాగస్వామి కాదన్నారు. తాము యూపీయేతో కలిసి లేమని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని, పార్లమెంటులో తమకు సొంత గుర్తింపు ఉందని అన్నారు.  ‘సామ్నా’ సంపాదకుడు కూడా ఆయనే అనే విషయం తెలిసిందే. 


Updated Date - 2020-12-26T21:05:51+05:30 IST